భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుద‌ల‌

ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభం కానున్న‌‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగోను, నినాదాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు

భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుద‌ల‌
  • లోగోను, నినాదాన్నిఆవిష్క‌రించిన‌
  • కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే


విధాత‌: ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభం కానున్న‌‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగోను, నినాదాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు. ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి ఖర్గేతోపాటు పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి, జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్‌, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.


యాత్ర నినాదం “న్యాయ్ కా హక్ మిల్నే తక్”


మ‌ణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 14న ప్రారంభ‌మై 15 రాష్ట్రాల మీదుగా సాగుతుంద‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే చెప్పారు. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అందించే దిశగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ త‌మ‌ బలమైన ముందడుగు అని ఖర్గే తెలిపారు. యాత్ర నినాదం “న్యాయ్ కా హక్ మిల్నే తక్” అని చెప్పారు.


“మరే మార్గం లేదని చెప్పడానికి మేము ప్రజల మధ్యకు వెళ్తున్నాం. పార్లమెంటులో మాట్లాడి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశాం. కానీ ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. దేశ చరిత్రలో తొలిసారిగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆయన కనీసం లోక్‌సభకు వచ్చారు కానీ ఒక్కసారి కూడా రాజ్యసభ వైపు చూడలేదు’ అని ఖ‌ర్గే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


యాత్ర ముఖ్యాంశాలు..


రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14న ఇంఫాల్‌లో ప్రారంభమై 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర సాగనున్న‌ది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో పాదయాత్ర ముగుస్తుంది.