Deepika Padukone Becomes Mental Health Ambassador | కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ అంబాసిడర్ గా దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు దేశంలోనే మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా నియమించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ఈ నియామకం కీలకం.

న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ నటి ప్రఖ్యాత భారతీయ నటి దీపికా పదుకొణె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు దేశంలోనే మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా నియమితులయ్యారు. దీపికా ఎంపిక భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన దీపికా స్పందిస్తూ..ఈ పదవిని చేపట్టడం తాను గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవడంలో తన నిబద్ధతను ఈ బాధ్యత దోహదం చేస్తుందన్నారు. భారతదేశ ప్రజల ఆరోగ్య, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంలో సాధించిన గణనీయమైన పురోగతిని కేంద్రం సహకారంతో మరింత సమర్ధవంతంగా కొనసాగించడం లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అవగాహన పెంచడం, కళంకాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందన్నారు.
ఈ సందర్భంగా 2015లో తాను స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ప్రయాణ పురోగతిని దీపికా గుర్తు చేసుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించానని తెలిపింది. ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు..నువ్వు నా కూతురికి సహాయం చేశావు అని చెప్పినప్పుడు వచ్చిన ఆనందం మరెక్కడా తనకు లభించలేదని తెలిపింది. మనదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను రోజువారీ జీవితంలో ఒక సాధారణ ప్రక్రియగా మార్చడంలో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్య అవగాహన అనేది ఏదో ఒక రోజు గల్లీ క్రికెట్ లాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకొచ్చింది.