CM Arvind Kejriwal | బీజేపీ కార్యాలయం ముట్డడికి ఆప్ యత్నం.. అడ్డుకున్న పోలీసు బలగాలు

ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు వరుసగా తమ పార్టీ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తుందని, దమ్ముంటే అందరిని ఒకేసారి అరెస్టు చేసుకోవాలంటూ

CM Arvind Kejriwal | బీజేపీ కార్యాలయం ముట్డడికి ఆప్ యత్నం.. అడ్డుకున్న పోలీసు బలగాలు

కేజ్రీవాల్ సహా ఆప్‌నేతల నిరసన

ఆప్‌ను నిలువరించేందుకే మోదీ ఆపరేషన్ ఝాడు

విధాత: ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు వరుసగా తమ పార్టీ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తుందని, దమ్ముంటే అందరిని ఒకేసారి అరెస్టు చేసుకోవాలంటూ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి బయలుదేరిన సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అర‌వింద్ కేజ్రీవాల్ పీఏ బిభ‌వ్ కుమార్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా ఢిల్లీలో బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యం ముట్టడికి ఆప్ పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన కేజ్రీవాల్‌ను ఆప్ కార్యాలయం బయటే అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులకు, ఆప్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం సాగింది. దీంతో కేజ్రీవాల్ రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆప్ కార్యాలయం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు బీజేపీ కార్యాలయం ముందు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడడుగుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 144సెక్షన్ విధించారు. ఆప్ నిరసన సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్ బీజేపీపైన, ప్రధాని నరేంద్ర మోదీలపైన తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీని భూస్థాపితం చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నారని, ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. బీజేపీ విస్తరణకు ఆప్‌ను ముప్పుగా భావిస్తుందని, నాకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని ఆరోపించారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమేనని, మునుముందు ఈ తరహా చర్యలు మరిన్ని ఉంటాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం ఆప్ బ్యాంక్ ఖాతాల‌ను ఫ్రీజ్ చేస్తామ‌ని ఈడీ న్యాయ‌వాది ఇప్ప‌టికే కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చార‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఖాతాల‌ను ఇప్పుడే ఫ్రీజ్ చేస్తే ఆప్‌న‌కు సానుభూతి ల‌భిస్తుంద‌నే ఉద్దేశంతో మ‌న ఖాతాల‌ను లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం ఫ్రీజ్ చేసేందుకు కాషాయ పాల‌కులు స్కెచ్ వేశార‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల అనంత‌రం మ‌న కార్యాల‌యాన్ని దిగ్బంధించి మ‌న‌ల్ని రోడ్డు మీద‌కి తీసుకువ‌స్తార‌ని, బీజేపీ ఇదే ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళుతున్న‌ద‌ని కేజ్రీవాల్ పార్టీ శ్రేణుల‌కు వెల్ల‌డించారు.