Delhi | మండిపోయిన ఢిల్లీ.. 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వేసవి ప్రకోపానికి ఢిల్లీ తల్లడల్లిపోయింది. బుధవారం దేశంలోనే ఎన్నడూ ఎక్కడా లేనంత స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది

Delhi | మండిపోయిన ఢిల్లీ.. 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

చరిత్రలో మునుపెన్నడూ లేనంత తీవ్రత

న్యూఢిల్లీ : వేసవి ప్రకోపానికి ఢిల్లీ తల్లడల్లిపోయింది. బుధవారం దేశంలోనే ఎన్నడూ ఎక్కడా లేనంత స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వడగాలులు, ఎండ తీవ్రతతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరైంది. ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌ వాతావరణ కేంద్రం వద్ద బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 52.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయినట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయమే ఐఎండీఏ హెచ్చరిక జారీ చేస్తూ మరికొన్ని రోజుల పాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వాడగాలు వీస్తాయని, గరిష్ఠస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.

ఢిల్లీ పొరుగునే ఉన్న హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సైతం ఎండలు మండిపోయాయి. రాజస్థాన్‌లోని ఫలోడీలో 51 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర వడగాలుల నేపథ్యంలో సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఐఎండీఏ కోరింది. మరోవైపు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో విద్యుత్తు డిమాండ్‌ కూడా ఆల్‌ టైం హై గరిష్ఠానికి.. 8,302 మెగావాట్లకు చేరుకున్నది. ఇది ఢిల్లీ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఈ వేసవిలో విద్యుత్తు డిమాండ్‌ 8,200 మెగావాట్లు దాటుతుందని డిస్కమ్‌ అధికారులు అంచనా వేసినా.. దాన్ని మించిపోయింది.