ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు.. మోదీ వ్యతిరేక నినాదాలు

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు ఉధృతం కాగా, మెట్రో స్టేషన్ల మూసివేత, ఢిల్లీ పోలీసులకు ఎన్ఎస్ఏ కింద ప్రత్యేక అధికారాలు కల్పించడం చర్చనీయాంశమైంది.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్ధులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల పర్వం కొనసాగుతుంది. గురవారం జరిగిన నిరసనలలో దాదాపుగా లక్ష మంది వరకు విద్యార్ధులు, యువకులు పాల్గొనడం విశేషం. విద్యార్ధులు పెద్ద ఎత్తున ప్రధాని మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ స్వయంగా పేపర్ల లీకేజీకి సంబంధించి విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికి సీజేపీ తన ఆందోళనలను విరమించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేదిలేదంటూ సీజేపీ ప్రకటించింది. విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. మెట్రో రైలు స్టేషన్లను మూసివేసి విద్యార్ధులు జంతర మంతర్ వద్దకు చేరుకోకుండా నిలువరించే ప్రయత్నం చేశారు.

మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంలో పిటిషన్

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండోరోజు 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. దాంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది న్యాయస్థానానికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిషన్ వేసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరింది. దీనికి సీజేఐ స్పందిస్తూ.. మధ్యాహ్నం వేచి చూద్దామని అన్నారు. ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోటాపోటీ విమర్శలు

నీట్ పేపర్ లీకేజీ అంశంపై జెన్ జీ ఉద్యమం పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులపైన, అల్లర్లు, ఆందోళనలపైన సోషల్ మీడియా అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. పలు నగరాలలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన యువతను పోలీసులు అడ్డుకొనడం, డ్రగ్స్ వంటి అక్రమ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారంటూ సీజేపీ అనుకూల వర్గాలు వీడియోలను పోస్టు చేశాయి. ఢిల్లీలో విద్యార్ధుల ఆందోళనల సందర్బంగా విద్యార్ధులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్, టీయర్ గ్యాస్ వీడియోలను పోస్టు చేశారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రికెటర్లు విద్యార్ధుల ఆందోళనకు మద్దతు తెలిపాయి.

అదే సమయంలో విద్యార్ధుల ఆందోళనలను తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియలో వీడియోలు పోస్టు చేశాయి. ప్రధాని మోదీని, హిందు మతాన్ని, దేశాన్ని, మిలటరీని, పోలీసులను కించపరిచేలా నిరసనకారులు మాట్లాడారంటూ పలు వీడియోలు పోస్టు చేశారు. ఢిల్లీ నిరసనల సందర్బంగా పోలీసులపై కొందరు విద్యార్ధులు జరిపిన దాడుల వీడియోలు పోస్టు చేసి..ఇలాంటి దాడులు చేసిన వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. విద్యార్ధుల నిరసనల వెనుక విచ్చిన్నకర శక్తులు, విదేశీ సంస్థల ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.

ఢిల్లీ పోలీసులకు విశేష అధికారాలు

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధుల నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు డిటెన్షన్ పవర్స్ మంజూరు చేసింది. ఆక్టోబర్ 18వరకు ఈ పవర్స్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చట్టం విశేష అధికారాల మేరకు ఎవరినైనా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండా 12రోజుల నుంచి 12నెలల వరకు నిర్భంధించే అధికారం ఉంటుంది.

Latest News