Flight Charges | ప్రయాణికులకు షాక్‌..! భారీగా పెరిగిన విమాన ఛార్జీలు..!

Flight Charges | ప్రయాణికులకు షాక్‌..! భారీగా పెరిగిన విమాన ఛార్జీలు..!

Flight Charges | ప్రయాణీకులకు విమానయాన సంస్థలు షాక్‌ ఇచ్చాయి. విమాన టికెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల విస్తారా ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు భారీగా రద్దయ్యాయి. అదే సమయంలో ఎండకాలం ఎండలు దంచుతుండడంతో కంపెనీలు ఒకేసారి ఛార్జీలను పెంచేశాయి. చాలా మార్గాల్లో 20-25శాతం వరకు ధరలను పెంచాయి. విమానయాన సేవలకు భారీగా డిమాండ్‌ నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పైలట్స్‌ సంక్షోభం నేపథ్యంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ రోజుకు కనీసం 25-30 వరకు విమాన సర్వీసులు, రోజువారీ షెడ్యూల్‌లో పదిశాతం సర్వీసులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే దివాళా తీసిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ గతంలోనే సేవలను నిలిపివేసింది. ఇంజిన్‌ సమస్యల కారణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలనపడ్డాయి. దాంతో సేవల సామర్థ్యం తగ్గింది. దీనికి వస్తారా పైలట్ల సంక్షోభం మరింత తోడుకావడంతో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

దాంతో ఈ నెల ఒకటి నుంచి 7వ తేదీ మధ్య దేశీయ మార్గాల్లో విమాన సర్వీసుల స్పాట్‌ ఛార్జీలు గతనెలతో పోలిస్తే 39శాతం పెరుగుదల నమోదైంది. గతవారం ఢిల్లీ-బెంగళూరు సర్వీస్‌ స్పాట్‌ టికెట్‌ శాతం రేటు 39శాతం పెరిగింది. ఢిల్లీ ఢిల్లీ-శ్రీనగర్‌ మధ్య 30శాతం, ఢిల్లీ-ముంబయి మధ్య 12 శాతం, ముంబయి-ఢిల్లీ మార్గంలో ఎనిమిదిశాతం వరకు ఛార్జీలు పరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్‌ టికెట్‌ చార్జీల పెరుగుదల 20 నుంచి 25 శాతంగా ఉండవచ్చని ప్రముఖ ట్రావెల్‌ పోర్టల్‌ యాత్రా డాట్‌ కామ్‌కు చెందిన ఎయిర్‌ అండ్‌ హోటల్‌ బిజినెస్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ మాలిక్‌ తెలిపారు. విస్తారా సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై గణనీయ ప్రభావం చూపిందని.. ఢిల్లీ నుంచి గోవా, కొచి, జమ్ము, శ్రీనగర్‌కు నడిచే విమానాలకు అధిక డిమాండ్‌ ఉండడంతో ఆయా మార్గాల్లో ధరలు అధికంగా పెరిగాయని వివరించారు.