నాలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంచార్జిల ఖరారు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లకు బీజేపీ పార్టీ తన ఎన్నికల ఇంచార్జిలను ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ 3.0ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ఎన్డీఏకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

కిషన్‌రెడ్డికి జమ్మూకాశ్మీర్ బాధ్యతలు
విధాత, హైదరాబాద్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లకు బీజేపీ పార్టీ తన ఎన్నికల ఇంచార్జిలను ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ 3.0ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ఎన్డీఏకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న హర్యానా, మహారాష్ట్రలను తిరిగి దక్కించుకోవడంతో పాటు జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో అధికార సాధనకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ తన ఇంచార్జిలను ప్రకటించింది.
బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా, కో-ఇంఛార్జిగా పార్టీ నేతలు సీనియర్ నేతలు కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్‌లను నియమించింది. హర్యానా ఇంచార్జిలుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్ దేవ్‌లను నియమించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వా శర్మలను జార్ఖండ్‌కు పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లుగా నియమించారు. మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని జమ్మూ,కాశ్మీర్ రాష్ట్ర ఇంచార్జిగా నియమించారు. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను అప్పగించడం పెద్ద టాస్క్‌గా భావిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అనంతరం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ఆగస్టు 5, 2019న ఆమోదించబడింది, జమ్మూ, కాశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించారు. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కూడా రద్దు చేసింది. 370అర్టికల్ రద్ధు పిదప ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కోని బీజేపీ ఎన్‌డీఏలను మెజార్టీ సీట్లలో గెలిపించడం కిషన్‌రెడ్డికి సవాల్‌గా నిలువనుంది. భారత ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు ఎన్నికల ప్రకియకు విఘాతం కల్గించే ప్రయత్నంలో మళ్లీ హింసాత్మక ఘటనలకు దిగుతున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు మాత్రం భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగియడం గమనార్హం.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 90సీట్లు ఉన్నాయి. మార్చి 2020లో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క డీలిమిటేషన్ కోసం రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది. డీలిమిటేషన్ పిదప అదనంగా 6 సీట్లు జమ్మూ డివిజన్‌కు ,1 సీటు కాశ్మీర్ విభాగానికి జోడించబడ్డాయి . డీలిమిటేషన్ తర్వాత, అసెంబ్లీలోని మొత్తం సీట్లు 114 స్థానాలకు పెరిగాయి. అందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు కేటాయించబడ్డాయి . మిగిలిన 90 సీట్లలో 43 సీట్లు జమ్మూ డివిజన్‌లో, 47 సీట్లు కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి. తుది డీలిమిటేషన్ నివేదిక 20 మే 2022 నుండి అమల్లోకి వచ్చింది. 11 డిసెంబర్ 2023న సుప్రీంకోర్టు తన తీర్పులో ఆర్టికల్ 370 రద్దును రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. 30 సెప్టెంబర్ 2024లోపు జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.