రేపే తొలి విడుత.. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల సమరం శుక్రవారం నుంచి (ఏప్రిల్‌ 19, 2024) ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో నిర్వహించే పోలింగ్‌ తొలి విడుత శుక్రవారం నిర్వహించనున్నారు

రేపే తొలి విడుత.. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో పోలింగ్‌

బరిలో మహామహులు, కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమరం శుక్రవారం నుంచి (ఏప్రిల్‌ 19, 2024) ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో నిర్వహించే పోలింగ్‌ తొలి విడుత శుక్రవారం నిర్వహించనున్నారు. తొలి దశలో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడుతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. మరో 11 రాష్ట్రాల్లో కొన్ని స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. తొలి దశలో పలువురు కీలక నేతలు పోటీలో ఉండటం ఆసక్తి రేపుతున్నది. 102 లోక్‌సభ స్థానాల ఓటర్లు తొలి విడుతలో ఓటు వేయనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే పోలింగ్‌.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ సమయానికి క్యూ లైన్లలో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
దాదాపు 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వారిలో జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ బరిలో ఉన్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రంలోని నాగపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన గెలిస్తే హ్యాట్రిక్‌ కానున్నది. జతిన్‌ ప్రసాద ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం మేనకాగాంధీ కుటుంబానికి గట్టి పట్టున్న ప్రాంతం. ఇక్కడ ఆమె కుమారుడు వరుణ్‌గాంధీని కాకుండా.. యూపీ మంత్రిని బీజేపీ బరిలో నిలపడం విశేషం. ఇక తమిళనాడులోని నీలగిరీస్‌ నుంచి డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి ఏ రాజా పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రాజా ఓడిపోయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో దాదాపు 5 లక్షల పైచిలుకు మెజార్టీతో తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌ను ఆయన ఎదుర్కొనబోతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలై పోటీ చేస్తున్నారు. ఇది అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేకు బలమైన ప్రాంతం. అయితే.. ఇది సీపీఎం సిటింగ్‌ స్థానం. అయితే.. సీట్ల సర్దుబాటులో దీనిని డీఎంకేకు కేటాయించారు. డీఎంకే తరఫున గణపతి పీ రాజ్‌కుమార్‌, అన్నాడీఎంకే నుంచి సింగాయి రామచంద్రన్‌ గట్టిపోటీదారులుగా ఉన్నారు. తమిళనాడులోని చెన్నై సౌత్‌ నుంచి బీజేపీ తరఫున మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఆమె భారీ తేడాతో పరాజయం పొందారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అరుణాచల్‌ వెస్ట్‌ సీటు నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు పోటీ చేస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నాబం టుకిని ఆయన ఎదుర్కొనబోతున్నారు. అసోంలోని జోర్హట్‌ సీటు నుంచి బీజేపీ నుంచి తపూన్‌ కుమార్‌ గొగోయ్‌, కాంగ్రెస్‌ నుంచి గౌరవ్‌ గొగోయ్‌ పోటీ చేస్తున్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ తనయుడే గౌరవ్‌. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ పోటీ చేస్తున్నారు. ఈ సీటు నుంచి గతంలో కమల్‌నాథ్‌ 1980 నుంచి 9 పర్యాయాలు గెలుపొందారు. ఇది ఆ కుటుంబానికి గట్టి పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాలకు 28 స్థానాలూ కైవసం చేసుకున్న బీజేపీ.. ఇక్కడ మాత్రం ఓడిపోయింది.

రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి బీజేపీ నుంచి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కాంగ్రెస్‌ నుంచి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ బరిలో ఉన్నారు. ఇది కాంగ్రెస్‌కు చారిత్రకంగా పట్టున్న ప్రాంతం. కానీ.. 1999 నుంచి ఇక్కడ ఆ పార్టీ గెలువలేక పోయింది. 2004 నుంచి 2019 వరకు బీజేపీ గెలుస్తూ వచ్చింది.