బెంగాల్‌లో సీపీఎం వినూత్న ప్రచారం

బెంగాల్‌లో ప్రతిపక్ష సీపీఎం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేథ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య వీడియో రూపొందించి.. తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేసింది

బెంగాల్‌లో సీపీఎం వినూత్న ప్రచారం

బుద్ధదేవ్‌ భట్టాచార్య ఏఐ వీడియోలు
తృణమూల్‌, బీజేపీపై మాజీ సీఎం విమర్శలు

కోల్‌కతా: బెంగాల్‌లో ప్రతిపక్ష సీపీఎం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేథ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య వీడియో రూపొందించి.. తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేసింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. దాదాపు 2 నిమిషాలపాటు ఉన్న ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య సందేశ్‌ఖాలీ ఉదంతం, ఎలక్టోరల్ బాండ్లు, అవినీతి తదితర అనేక అంశాల్లో టీఎంసీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం అందులో ఉన్నది. సందేశ్‌ ఖాలీలో అది చేసిన పనికి తృణమూల్‌ కాంగ్రెస్‌ను క్షమించకూడదు. రాష్ట్రంలో మహిళలకు ఉపాధి లేదు, గౌరవం లేదు. రాష్ట్రం అవినీతి కూపంగా మారిపోయింది’ అని భట్టాచార్య ఆ వీడియోలో చెప్పారు.

కలహాలమారి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. బీజేపీ అవినీతిపార్టీ. నోట్ల రద్దుకు, కార్పొరేట్‌ శక్తులను బుజ్జగించే చర్యలకు పాల్పడింది. ఇప్పుడు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అవినీతి ముందుకు వచ్చింది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాపోయాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురైంది’ అని ఆయన అందులో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా సీవోపీడీ (శ్వాసకోశ సంబంధిత సమస్యలు), ఇతర అనారోగ్యాలతో 80 ఏళ్ల భట్టాచార్య బాధపడుతున్నారు. 2019 ఫిబ్రవరి 3న నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ సీఎం.. తర్వాత బయట కనిపించలేదు. భట్టాచార్య గత ఉపన్యాసాల ఆధారంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు పదిరోజుల పాటు ఏఐ అవతార్‌కు పార్టీ కార్యకర్తల బృందం శిక్షణ ఇచ్చింది.

గతంలో సీపీఎం పశ్చిమబెంగాల్‌ శాఖ సమత పేరుతో ఒక ఏఐ అవతార్‌ను రూపొందించి.. పార్టీ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ చానళ్లలో వార్తల బులెటిన్లకు ఉపయోగించింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడేవారో అనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్టు సీపీఎం నేత శామిక్‌ లహరి చెప్పారు. ఆయన పార్టీ ఏఐ ప్రాజెక్టుల వ్యవహారాల కీలక గ్రూపులో భాగస్వామిగా ఉన్నారు. భట్టాచార్యను ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటే పార్టీ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.

పరిశ్రమల ఏర్పాటు గురించి ఆయన వాదించేవారు. మన యువతకు ఉద్యోగాలు రావాలని ఆయన కోరుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సందేశాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలు ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది’ అని లహరి తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ చేసిన దానికి భిన్నంగా సీపీఎం చేసి ఉండేదనే సందేశాన్ని ఏఐ వీడియో సందేశంలో భట్టాచార్య చెప్పారు. ‘ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వామపక్షాలు మాత్రమే రక్షించగలవని ప్రజలు అర్థం చేసుకుంటారు’ అని ఆయన తెలిపారు.

భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్టీలోనూ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో పెద్ద ఎత్తున భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆయన పనిచేశారు. కోల్‌కతాను బెంగళూరు, హైదరాబాద్‌ తరహాలో ఐటీ హబ్‌గా మార్చాలని ఆకాంక్షించారు. అదే సమయంలో సింగూర్‌, నందిగ్రామ్‌ వంటి ఉద్యమాలు రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్ష పాలనకు ప్రాథమికంగా నష్టం చేశాయనే అభిప్రాయాలు ఉన్నాయి. సింగూర్‌, నందిగ్రామ్‌ వంటి ఘటనలను మళ్లీ ప్రజలకు ఈ వీడియో గుర్తు చేస్తుందా? అన్న ప్రశ్నకు.. ప్రజలు పరిశ్రమలు, ఉద్యోగం అంశాల అవసరాన్ని గుర్తించారని శామిక్‌ లహరి చెప్పారు. ఆ ఉద్యమాలు టీఎంసీ, అతివాద వామపక్షాలు, ఆరెస్సెస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసినవేనని అందరికీ అర్థమైందని అన్నారు.