Haryana Assembly polls । బీజేపీకి ఓటేయాలని కోరి.. వచ్చి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ: హర్యానాలో రాజకీయ విచిత్రం
రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలని ఆ ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపైకి వచ్చారు.

Haryana Assembly polls । మరో రెండు రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ గురువారం మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలని ఆ ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపైకి వచ్చారు. ఆయన వస్తుండగా.. ‘ఆజ్ ఉన్‌కీ ఘర్ వాపసీ హోగయీ హా’ (ఈ రోజు ఆయన తిరిగి సొంతింటికి చేరుకున్నారు’ అని ప్రకటించారు.
దళిత నాయకుడైన తన్వర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాగా సన్నిహితుడనే పేరు ఉంది. అయితే.. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాతో అభిప్రాయా భేదాల నేపథ్యంలో ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో చేరడానికి కొద్ది గంటల ముందే ఆయన సఫిదాన్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో పాల్గొని, బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని ప్రజలను కోరారు. అక్కడ ప్రచారం ముగించుకుని నేరుగా వచ్చి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం విచిత్రం.
ఒకప్పుడు తన్వర్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం చూపిన వివక్షను కూడా బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో వాడుకున్నది. ఢిల్లీలో హుడా మద్దతుదారులతో జరిగిన గొడవలో తన్వర్‌కు గాయాలై అంశాన్ని ప్రస్తావించి కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. కానీ.. తన్వర్ మాత్రం కాంగ్రెస్ గూటికి చేరాలనే నిర్ణయించుకున్నారు. ఆయన రాక రాష్ట్ర పార్టీకి గట్టి బలాన్ని ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలం తర్వాత బీజేపీ నుంచి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో దళిత నాయకుడు తన్వర్ చేరిక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది.
వేదికపై రాహుల్ గాంధీతో కరచాలనం చేసిన భూపిందర్‌సింగ్ హుడాను కూడా తన్వర్ పలుకరించారు. తన్వర్ వెన్ను తడుతూ ఆయనను హుడా పార్టీలోకి స్వాగతించారు. ఈ సమయంలో వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో ఆప్‌లో చేరిన తన్వర్.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ ఏడాది జనవరిలో ఆ పార్టీ నుంచి వైదొలిగారు. ఆప్‌లో చేరడానికి ముందు కొంతకాలం తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. బీజేపీలో చేరి, కాంగ్రెస్ నేత కుమారి శెల్జాపై సిర్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.