Rahul Gandhi | ఆగస్ట్‌ 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీని ఆగస్ట్‌ 15 నుంచి ఇండియా కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

Rahul Gandhi | ఆగస్ట్‌ 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

జూన్‌ 4న ఇండియా కూటమికి అధికారం
బీజేపీ ఓడిపోతుందని మోదీకి అర్థమైంది
యువత దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తారు
నాలుగైదు రోజుల్లో ఏదో ఒక డ్రామా చేస్తారు
వీడియో సందేశంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీని ఆగస్ట్‌ 15 నుంచి ఇండియా కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఈ ఎన్నికలు తమ చేజారిపోతున్నాయని అర్థమైన ప్రధాని నరేంద్రమోదీ రానున్న నాలుగైదు రోజుల్లో దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తారని దేశ యువతనుద్దేశించి చెప్పారు. ‘ఆయన ప్రధాన మంత్రి కాబోవడం లేదు. అందుకే నాలుగైదు రోజుల్లో మీ దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తారు. ఏదో డ్రామా లేదా మరోటో చేస్తారు. కానీ.. మీ దృష్టి మళ్లకూడదు. నిరుద్యోగం అనేది ప్రధాన అంశం. మోదీ రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. కానీ.. అది అబద్ధం. ఆయన పెద్ద నోట్లు రద్దు చేశారు. దోషపూరిత జీఎస్టీ తెచ్చారు. అదానీ వంటి వారికి సేవ చేశారు’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘భారతి భరోసా’ను మేం తెస్తున్నాం. జూన్‌ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఆగస్ట్‌ 15 నుంచి కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. జై హింద్‌. నమస్కార్‌’ అంటూ ఆ వీడియోను ఆయన ముగించారు.