Rahul Gandhi : రాహుల్ జీ పెళ్లి చేసుకోండి..స్వీట్స్ పంపిస్తాం

దీపావళి సందర్భంగా ఓల్డ్ ఢిల్లీలోని ఘంటేవాలా స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. షాప్ యజమాని సుశాంత్ జైన్, "మీరు త్వరగా పెళ్లి చేసుకోండి, మాకు స్వీట్ల ఆర్డర్ వస్తుంది" అని చమత్కరించారు. రాహుల్ నవ్వుతూ స్పందించారు.

Rahul Gandhi : రాహుల్ జీ పెళ్లి చేసుకోండి..స్వీట్స్ పంపిస్తాం

ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ దీపావళి పండుగ సందర్భంగా స్వీట్స్ కొనేందుకు ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపుకు వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీని స్వీట్ షాపు యజమాని సుశాంత్ జైన్ సాధరంగా ఆహ్వానించారు. అయితే అశ్చర్యకరంగా రాహుల్ ముందు ఓ అభ్యర్థన పెట్టాడు. రాహుల్ జీ మీరు త్వరగా పెళ్లి చేసుకోండి..మాకు స్వీట్ల ఆర్డర్ దొరుకుతుందని రెండు చేతులు జోడించి చమత్కరించారు. రాహుల్ జీ..మీ పెళ్లి కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని చెప్పిన షాప్ యజమాని..త్వరగా పెళ్లి చేసుకుంటే స్వీట్లు పంపిస్తామని పేర్కొన్నాడు. సుశాంత్ జైన్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ముసిముసి నవ్వులు నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఏడాది దీపావళి రోజున ఐకానిక్ ఘంటేవాలా మిఠాయి షాపుకు రాహుల్ గాంధీ వస్తుంటారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్వీట్లు కొనుక్కుని వెళ్తుంటారు. సోమవారం కూడా ‘ఇమార్తి’, ‘బేసన్ లడ్డూ’లు తీసుకెళ్లారు. అలాగే స్వీట్స్ షాపులో కొద్ది సేపు వంటకాలు కూడా చేశారు.

ఈ సందర్బంగా షాపు యజమాని సుశాంత్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ త్వరగా పెళ్లి చేసుకోవాలని.. స్వీట్స్ సరఫరా చేస్తానని అభ్యర్థించినట్లు చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి రాహుల్ గాంధీ అన్నారు. చాలా కాలంగా గాంధీ కుటుంబానికి స్వీట్లు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దివంగత రాజీవ్ గాంధీ ఇమార్తి స్వీట్లు అంటే చాలా ఇష్టపడేవారని.. అలాగే బేసన్ లడ్డులు కూడా చాలా ఇష్టపడేవారని గుర్తుచేశారు. తండ్రికి లాగానే కుమారుడు కూడా అవే స్వీట్స్ ఇష్టపడతారని పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా తయారు చేస్తామని తెలిపాడు.