Toll Free Highways | దేశంలో మరో 25 టోల్ గేట్లు లేని ప్లాజాలు

అప్పటిదాకా నేషనల్‌ హైవేపై దూసుకొచ్చి.. టోల్‌ప్లాజా వద్ద నిరీక్షించడం అంటే మామూలు కాదు. ఈ సమస్యను తొలగించేందుకు కేంద్రం ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. గుజరాత్‌లో ఈ ప్రయోగం సక్సెస్‌ అవగా.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 25 టోల్‌ప్లాజాల వద్ద గేట్లు తొలగించబోతున్నారు.

  • By: TAAZ |    national |    Published on : Oct 21, 2025 4:10 PM IST
Toll Free Highways | దేశంలో మరో 25 టోల్ గేట్లు లేని ప్లాజాలు

Toll Free Highways |  గుజరాత్ రాష్ట్రంలో నేషనల్ హైవే పై ప్రయోగాత్మకంగా ప్రారంభించిన టోల్ గేట్ లేని విధానం (అవరోధ రహిత టోల్ వసూలు వ్యవస్థ) విజయవంతమైంది. దీంతో దేశంలోని మరో 25 టోల్ ప్లాజాల వద్ద గేట్లను తొలగించి అవరోధ రహిత టోల్ వసూలు వ్యవస్థను ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ రద్ధీ అధికంగా ఉన్న ప్లాజాల వద్ద అమలు చేయాలనే యోచనలో ఉన్నారు. మున్ముందు దేశ వ్యాప్తంగా టోల్ గేట్లు అనేవి ఉండవు, టోల్ చెల్లింపు కోసం క్యూలో ఉండాల్సిన బాధ తప్పుతుంది. వాహనం వెళ్తుండగానే ఆటోమెటిక్ గా టోల్ ఫీజు ను కలెక్టు చేసుకుంటాయి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ దూరం మేరకే ఫీజును లెక్కించి తీసుకుంటాయి. ప్రస్తుతం పాతిక లేదా యాభై కిలోమీటర్ల దూరం మధ్యలో టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. పండగలు, సెలవు దినాలలో ఈ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి. గంటల కొద్దీ వేచి ఉండడం కారణంగా ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. టోల్ గేట్ లేని వ్యవస్థ అమలులోకి వస్తే నేషనల్ హైవేలపై ఎక్కడ కూడా ఆగాల్సిన పని ఉండదు. ఉదాహారణకు హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పై సంక్రాంతి, దసరా, దీపావళి, సెలవు రోజులలో టోల్ ప్లాజాల వద్ద కనీసం అరగంట నుంచి గంట వరకు వేచి ఉంటున్న విషయం తెలిసిందే.

గుజరాత్ రాష్ట్రంలోని నేషనల్ హైవే 48 పై భరూచ్ – సూరత్ మధ్యనున్న చొర్యాసి వద్ద ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా టోల్ గేట్లను తొలగించారు. సంప్రదాయక టోల్ గేట్ల విధానానికి ఫుల్ స్టాఫ్ పడింది. రోడ్లకు ఇరువైపులా ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ ( ఏ.ఎన్.పీ.ఆర్) కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు వాహన వివరాలు సంగ్రహించి టోల్ ఫీజులు ఖరారు చేస్తాయి. వాహనాల నుంచి టోల్ మొత్తం వసూలు అవుతుంది కాని గేట్లు అనేవి కన్పించవు. ఈ విధానాన్ని గుజరాత్ లో అమలు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) ఇండియన్ హైవేస్ మేనేజిమెంట్ కంపెనీ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఫాస్టాగ్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానం తో టోల్ కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. అయితే ప్రతి వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్.ఎఫ్.ఐ.డి) రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అమర్చుతున్నారు. ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ ( ఏ.ఎన్.పీ.ఆర్) కెమెరాలు వీటిని సంగ్రహించి, ఎన్ని కిలోమీటర్ల దూరం వాహనం ప్రయాణించింది అనేది చూసుకుని, ఆ దూరం వరకే టోల్ ఫీజు ను ఫాస్టాగ్ నుంచి తీసుకుంటుంది. దీంతో వాహనాలు టోల్ ఫ్లాజాల వద్ద ఆగకుండా రయ్ రయ్ మంటూ వెళ్తున్నాయి. ఫలితంగా వాహనాల రద్దీ తప్పడమే కాకుండా పాతికేళ్ల క్రితం మాదిరి అడ్డంకులు లేకుండా ప్రయాణం సాగుతోంది. ప్లాజాల వద్ద వాహనాలు గంటల కొద్దీ నిలపడం మూలంగా ఇంధనం తో పాటు సమయం కూడా వృధా అవుతున్నది. ఇప్పుడా ఆ బాధలు తప్పాయని వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వేళ ఫాస్టాగ్ లేనట్లయితే సంబంధిత వాహన యజమానికి ఎస్.ఎం.ఎస్ వెళ్తుంది. మీ వాహనం ఇంతదూరం ప్రయాణించింది, ఇంత మొత్తం బకాయి పడ్డారని తెలియచేస్తుంది. తరువాత చేసే రీఛార్జీ మొత్తం నుంచి దీన్ని మినహాయించుకుంటారు.

వచ్చే మార్చి నాటికి మరిన్ని ఫ్లాజాలు
గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విధానం విజయవంతం కావడంతో దేశంలోని మరికొన్ని నేషనల్ హైవేల పై అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 25 టోల్ ఫ్లాజాల వద్ద గేట్లను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న ప్లాజాలను గుర్తించే పనిలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిమగ్నమై ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1.46 లక్షల కిలోమీటర్లమేర నేషనల్ హైవేలు ఉన్నాయి.