విధాత : ఏపీలోని అరకు డివిజన్‌లో అనకాపల్లి – అల్లూరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దేవరాపల్లి మండలం జీనబాడు పొలాల్లో ఉన్న బావిలో 13అడుగుల పొడవైన భారీ గిరినాగు(కింగ్ కోబ్రా) కలకలం రేపింది.
పెదగంగవరానికి చెందిన ఓ రైతు పొలంలోని వ్యవసాయ బావిలో గిరినాగును చూసిన స్థానికులు ఆందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తూర్పు వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధి మూర్తి కంఠి మహంతి ఆధ్వర్యంలోని సిబ్బంది.. దాదాపు గంటపాటు శ్రమించి బావిలో నుంచి పామును బయటికి తీశారు. పైకి తీశాక గిరినాగును చాకచక్యంగా ఓ సంచిలో బంధించి దాని సహజ ఆవాసం శంకరం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
గిరి నాగులతో జీవ వైవిద్యం..
సాధారణంగా జెర్రిపోతు,కట్లపాము, నాగుపాము,రక్తపింజర పాములు మనుషులను తరచూ కాటేస్తుంటాయని, వీటి కాట్ల వల్ల మరణాలు సంభవిస్తుంటాయని మూర్తి కంఠిమహంతి పేర్కొన్నారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న ఆయా విషపూరిత జాతి పాములను, ఎలుకలను తింటూ జీవవైవిధ్యాన్ని కాపాడటమేకాకుండా మనుషులకు మేలు చేస్తున్న గిరినాగుల(కింగ్ కోబ్రా)ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మూర్తి చెప్పారు. ప్రపంచంలో కింగ్ కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనప్పటికి..అవి మనిషి కనిపిస్తే చాలు భయపడి పారిపోతుంటాయని ఆయన చెప్పారు. గిరినాగులను చంపాలని చూస్తే అవి బుసలు కొడుతూ కాటేస్తాయని,కానీ వాటి జోలికి వెళ్లక పోతే వాటి దారిన అవి పోతాయని మూర్తి తెలిపారు. గిరినాగును ఓ పెద్దపాము వచ్చిందని ప్రజలు వాటిని వెంటాడి చంపుతుంటారని, కానీ వాటిని చంపొద్దని మూర్తి కోరారు. మనుషులకు హాని తలపెట్టే పాముల సంఖ్య పెరగకుండా నిరోధిస్తూ మానవాళికి గిరినాగులు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు.
ప్రపంచంలోని తొలి ‘కింగ్ కోబ్రా'(గిరినాగు) అభయారణ్యం ఇక్కడే..
అంతరించిపోతున్న ‘గిరినాగు’ (కింగ్ కోబ్రా) జాతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల (Eastern Ghats) పరిధిలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని శంకరం రిజర్వ్ అటవీ ప్రాంతంలోని 2,400 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యేక అభయారణ్యాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం రాగానే ఇది అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు సంయుక్తంగా అడవులలో ఈ పాముల సంచారాన్ని గుర్తిస్తూ, జనావాసాల్లోకి వచ్చిన వాటిని సురక్షితంగా రక్షిస్తున్నాయి. గిరినాగుల గుడ్లను, పిల్లలను సంరక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కింగ్ కోబ్రాల అడ్డా…తూర్పు కనుమల అడవులు
తూర్పు కనుమలలో ఉత్తరాంధ్ర, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల అడవుల్లో గిరినాగుల ఆవాసాలను కాపాడటం ప్రాజెక్టు కింగ్ కోబ్రా లక్ష్యం. తెలంగాణ-ఏపీలోని పాపికొండల అభయారణ్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్రన్ ఘాట్ ప్రాంతాలు గిరినాగులకు అడ్డాగా మారాయి. పాపికొండల్లోని జలతారు వాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మార్చి నుంచి జులై నెలాఖరు వరకు అడవుల్లో జలవనరులు ఎండిపోయినపుడు గిరి నాగులు నీరు ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. వాగులు, వంకలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో గిరినాగులు ఎక్కువగా ఉంటాయి.తూర్పు కనుమలు, సరిహద్దు గ్రామాల్లో గిరినాగులు కనిపించడానికి కారణం ఇక్కడున్న పచ్చదనం, చల్లగా ఉండే భూములే కారణమని నిపుణులు చెబుతుంటారు.
గిరి నాగులను సంరక్షించుకోవాలి
జీవ వైవిధ్యానికి,సమతుల్యతకు ఉపయోగపడుతున్న గిరినాగులను హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972(Indian Wildlife Protection Act 1972) ప్రకారం నేరం. గిరినాగులు అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి.అంతరించిపోతున్న ఈ అరుదైన గిరినాగులను కాపాడుకోవాలని ఐయూసీఎన్ (ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) అంతర్జాతీయ వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ సూచించింది. ఈ కింగ్ కోబ్రాలు ఇతర పాములను ఆహారంగా తింటూ మనుషులకు మేలు చేస్తాయి కాబట్టి వీటిని కాపాడుకోవాలని ఐయూసీఎన్(IUCN) స్పష్టం చేసింది.
అరకు డివిజన్‌లో బావి నుండి రక్షించబడిన రాజనాగును, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సహకారంతో ఏపీ అటవీ శాఖ సురక్షితంగా దాని సహజ ఆవాసంలోకి విడుదల చేసారు.@PawanKalyan గారి నాయకత్వంలో ఏపీవ్యాప్తంగా వేగవంతమైన వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేయడానికి #Hanuman కార్యక్రమం కొనసాగుతోంది pic.twitter.com/1ahNj05Fm6
— Anil U (@UAnil07) July 12, 2026
