దేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు దెబ్బ …. మూడీస్ నివేదిక హెచ్చరిక
భారతదేశంలో నానాటికి పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని మూడీస్ రేటింగ్స్ మంగళవారం పేర్కొన్నది. ఇది ఆహార ద్రవ్యోల్బణానికి, ఆదాయాల తగ్గుదలకు దారి తీసి, సామాజిక అశాంతిని సృష్టించగలదని హెచ్చరించింది.
దేశంలో పెరుగుతున్న నీటి కొరత
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు దెబ్బ
ఆదాయాలు తగ్గి, ధరలు పెరిగే అవకాశం
అదే జరిగితే దేశంలో సామాజిక అశాంతి
నీటి సంరక్షణపై దృష్టిసారించాలని సూచన
న్యూఢిల్లీ : భారతదేశంలో నానాటికి పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని మూడీస్ రేటింగ్స్ మంగళవారం పేర్కొన్నది. ఇది ఆహార ద్రవ్యోల్బణానికి, ఆదాయాల తగ్గుదలకు దారి తీసి, సామాజిక అశాంతిని సృష్టించగలదని హెచ్చరించింది. నీటి సరఫరా మీద ఎక్కువగా ఆధారపడే థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లను ప్రభావితం చేయడం ద్వారా ఆయా రంగాల ప్రామాణిక ఆరోగ్యాలకు నష్టదాయకంగా మారుతుందని అంచనా వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తుండటం, అదేవేగంలో పారిశ్రామీకరణ, పట్టణీకరణ కారణంగా నీటి లభ్యతను తగ్గించివేస్తుందని పేర్కొన్నది. మరోవైపు వేగంగా మారుతున్న వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి తీవ్రంగా మారుతున్నదని, కరువులు, వడగాలులు, వరదలు వంటి తీవ్ర పరిణామాలకు వాతావరణ మార్పులు కారణమవుతుండటం కూడా ఒక అంశమని ‘భారత్ ఎదుర్కొంటున్న పర్యావరణ ముప్పు’ అనే నివేదికలో తెలిపింది. దీర్ఘకాలంలో నీటి నిర్వహణపై కేంద్రీకరించడం ద్వారా తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితుల ముప్పు నుంచి బయటపడవచ్చని పేర్కొన్నది.
‘నీటి సరఫరా తగ్గిపోవడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు దెబ్బతింటాయి. ఫలితంగా ఆహార వస్తువుల ధరలు పెరిగిపోతాయి. వ్యాపారవర్గాలు, ప్రజల ఆదాయాలు తగ్గిపోతాయి. అది సమాజంలో అశాంతిని రేకెత్తిస్తుంది. దాని వల్ల భారతదేశ వృద్ధి దెబ్బతింటుంది. ఎదురుదెబ్బలను తట్టుకునే ఆర్థిక సామర్థ్యాన్ని నీరుగార్చుతుంది’ అని మూడీస్ నివేదిక తెలిపింది.
2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లుగా ఉన్న భారతదేశ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చని పేర్కొంటున్న కేంద్ర జల వనరుల శాఖ గణాంకాలను ప్రస్తావించింది. నిజానికి 1486 క్యూబిక్ మీటర్లు అనేది కనిష్ఠస్థాయి. అంటే సాధారణ స్థాయికంటే 1700 క్యూబిక్ మీటర్లకు దిగువన ఉన్నది. వెయ్యి క్యూబిక్ మీటర్ల లభ్యత అనేది నీటి కొరతకు సూచికగా జల వనరుల శాఖ పేర్కొంటున్నది.
2024 జూన్ నెలలో ఉష్ణోగ్రతలు ఢిల్లీ, ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో 50 డిగ్రీలను దాటాయని, నీటి సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేశాయని మూడీస్ పేర్కొన్నది. అసలే తక్కువ సంఖ్యలో జలాశయాలు ఉండటం, ఆక్మసిక వరదల ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశాలేని సమయంలో వరదలు వాటికి భంగం కలిగిస్తున్నాయని తెలిపింది. ఉత్తరభారతదేశంలో వరదలు, 2023లో గుజరాత్‌లో సంభవించిన బిపర్‌జాయ్ తుఫాను కారణంగా మౌలిక వసతులకు 1.2 నుంచి 1.8 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. మరోవైపు రుతుపవన వర్షపాతం కూడా తగ్గుతున్నదని, కరువు కాటకాలు పెరుగుతున్నాయని తెలిపింది. 2023లో కురిసిన వర్షపాతం 1971 నుంచి 2020 మధ్య కురిసిన సగటు వర్షపాతం కంటే ఆరు శాతం తక్కువని మూడీస్ పేర్కొన్నది. అదే ఏడాది ఆగస్టులో మునుపెన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. రుతుపవన సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యే 70శాతం వర్షం కురుస్తుంటుంది. గతంలో వ్యవసాయ రంగానికి ఎదురైన ఇబ్బందులతో ధరలు పెరిగాయని, వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీలను ఇవ్వాల్సి వస్తున్నదని మూడీస్ పేర్కొన్నది. అది బడ్జెట్‌పై భారంగా మారాయని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram