Amit Shah | మావోయిస్టులకు అమిత్‌షా లాస్ట్ వార్నింగ్.. టార్గెట్ 2026పై 5న కీలక భేటీ
2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానిని వేగవంతం చేసే క్రమంలో ఏప్రిల్ 5న రాయ్‌పూర్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరవుతారని హోంశాఖ వర్గాలు తెలిపాయి.

Amit Shah | ఒకవైపు భీకర స్థాయిలో మావోయిస్టులను ఏరివేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు సుతిమెత్తగా విజ్ఞప్తి పేరుతో వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ కాగార్ పేరుతో నిర్వహిస్తున్న వరుస ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. తాజాగా శనివారం ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టుల హతమయ్యారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. డీఆర్‌జీ, ఛత్తీస్‌గఢ్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఎన్‌కౌంటర్ ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మావోయిస్టులకు హెచ్చరిక పూర్వక విజ్ఞప్తి చేశారు. ‘సాయుధులుగా ఉన్నవారికి నా విజ్ఞప్తి.. శాంతి, అభివృద్ధి తప్ప.. ఆయుధాలు, హింస ఎలాంటి మార్పును తేలేవు. లొంగిపోండి..’ అని ఆయన పిలుపునిచ్చారు. నక్సలిజంపై మరో దెబ్బ. సుక్మాలో ఒక ఆపరేషన్ సందర్భంగా మన భద్రతాదళాలు 16 మంది నక్సల్స్‌ను హతమార్చి, పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. 2026 మార్చి 31 నాటికి ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు సంకల్పించాం’ అని ఆయన ఎన్‌కౌంటర్ అనంతరం ఎక్స్‌లో పేర్కొన్నారు.
భద్రతపై సమీక్షకు 4న రాయ్‌పూర్‌కు షా
బస్తర్‌లో భద్రత పరిస్థితులపై సమీక్షించేందుకు హోం మంత్రి అమిత్‌షా ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా తొలుత దంతెవాడలో పర్యటించి, అనంతరం రాయ్‌పూర్ వెళతారని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ న్యూస్ 18 పేర్కొన్నది. రాష్ట్రంలోని సంబంధిత శాఖలు, కేంద్ర పారామిలిటరీ బలగాల ప్రతినిధులతో రాయ్‌పూర్‌లో 5వ తేదీన సమావేశంలో ఆయన పాల్గొంటారని ఆ వర్గాలు తెలిపాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యాన్ని వేగవంతం చేసే క్రమంలో ఇది అత్యంత కీలక సమావేశమని పేర్కొన్నాయి. గత ఐదేళ్ల వ్యవధిలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 85 శాతం తగ్గాయని హోం శాఖ డాటా పేర్కొంటున్నది. ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచీ ఎన్‌కౌంటర్లు పెరిగాయి. 2025లో శనివారం నాటి ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన 16 మృతదేహాలతో కలుపుకొని ఇప్పటి వరకూ 133 మంది నక్సల్స్ వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని ఛత్తీస్‌గఢ్ పోలీసుల డాటా పేర్కొంటున్నది.