Marriage Scam : టార్గెట్ క‌ట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్య‌క్తి భారీ మ్యారేజ్ స్కామ్‌

పెళ్లే వృత్తి.. కట్నమే టార్గెట్! యూపీలో ఆరేళ్లలో ముగ్గురిని పెళ్లి చేసుకున్న కిలాడీ పెళ్లికొడుకు. నాలుగో పెళ్లికి ప్లాన్ వేయగా.. ముగ్గురు భార్యలు ఏకమై ఇచ్చిన షాక్ మామూలుగా లేదు!

Marriage Scam : టార్గెట్ క‌ట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్య‌క్తి భారీ మ్యారేజ్ స్కామ్‌

పెళ్లంటే నూరేళ్ల పంట‌.. ఇది సామెత‌. కానీ ప్ర‌స్తుతం పెళ్లిని కొంద‌రు వ్యాపారంగా భావిస్తున్నారు. క‌ట్నం కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ యువ‌తుల గొంతు కోస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన ఓ వ్య‌క్తి భారీ మ్యారేజ్‌స్కామ్ (Marriage Scam) బ‌య‌ట‌ప‌డింది. అత‌డు క‌ట్నమే (Dowry) టార్గెట్‌గా ఆరేళ్ల‌లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అనంత‌రం వారిని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేసి.. మ‌రో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు.

ఆరేళ్ల‌లో మూడు పెళ్లిళ్లు..

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ల‌లిత్‌పూర్ జిల్లాకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి ఎలాంటి ఉద్యోగం చేయ‌డు. అత‌డి తండ్రి మాత్రం రైల్వే ఎంప్లాయి. ఎలాంటి ఉద్యోగం లేని సునీల్‌.. పెళ్లిని వ్యాపారంగా భావించాడు. క‌ట్నమే టార్గెట్‌గా పెళ్లి చేసుకునేవాడు. ఆ త‌ర్వాత అద‌న‌పు డ‌బ్బు తేవాలంటూ భార్య‌ను వేధించి వ‌దిలించుకునేవాడు. ఇలా ఆరేళ్ల‌లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏదో ఒక కార‌ణంతో వారిని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపేయ‌డం.. మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం.. ఇదే అత‌నడి ఉద్యోగం అయిపోయింది.

2019లో తొలి వివాహం

సునీల్‌కి 2019లో తొలి వివాహం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో భార్య కుటుంబం నుంచి అత‌డు రూ.8ల‌క్ష‌లు క‌ట్నంగా తీసుకున్నాడు. అందులో రూ.5 ల‌క్ష‌లు న‌గ‌దు కాగా, మిగ‌తాది న‌గ‌ల రూపంలో పొందాడు. వివాహం జ‌రిగిన త‌ర్వాత సునీల్ భార్య‌ను మ‌రింత క‌ట్నం కోసం వేధించ‌డం ప్రారంభించాడు. అయితే, అందుకు ఆమె అంగీక‌రించ‌లేదు. దీంతో భార్య‌ను పుట్టింటికి పంపించేశాడు. ఆ త‌ర్వాత ఆమెకు విడాకుల నోటీసులు పంపాడు. ప్ర‌స్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

బుల్లెట్ బైక్‌, బంగారం కావాలంటూ..

మొద‌టి భార్య‌ను వ‌దిలించుకున్న సునీల్ రెండో పెళ్లికి రెఢీ అయ్యాడు. మొద‌టి పెళ్లిని దాచిపెట్టి 2021లో మ‌రో యువ‌తిని మ‌నువాడాడు. ఆమె వ‌ద్ద నుంచి కూడా రూ.8 ల‌క్ష‌ల క‌ట్నం తీసుకున్నాడు. పెళ్లైన త‌ర్వాత కొన్ని నెల‌ల‌కే ఆమెను కూడా అద‌న‌పు క‌ట్నం కోసం వేధించ‌సాగాడు. ఓ బుల్లెట్ బైక్‌, బంగారం కావాల‌ని వేధించ‌సాగాడు. అందుకు రెండో భార్య నిరాక‌రించ‌డంతో ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించేశాడు.

గ‌ర్భ‌వ‌తి అని కూడా చూడ‌కుండా..

ఆ త‌ర్వాత సునీల్ 2023లో ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లైన కొన్ని నెల‌ల‌కే ఆమె గ‌ర్భం దాల్చింది. అయినా ఆమెను కూడా వ‌ద‌ల్లేదు. వేధింపుల‌కు గురిచేశాడు. అద‌న‌పు క‌ట్నం తెచ్చేందుకు నిరాక‌రించ‌డంతో ఇంట్లో నుంచి గెంటేశాడు. ప్ర‌స్తుతం ఆమెకు ఓ ఆడ‌బిడ్డ ఉంది.

న్యాయ‌పోరాటానికి దిగిన ముగ్గురు భార్య‌లు..

ఇప్పుడు సునీల్ నాలుగో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం తెలుసుకున్న ముగ్గురు భార్య‌లు ఏక‌మై న్యాయ‌పోరాటానికి దిగారు. మ‌రో యువ‌తి బ‌లి కాకూడ‌ద‌ని భావించిన ఆ ముగ్గురు బాధితులు సునీల్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ‌ను అత‌డు మోసం చేశాడ‌ని, ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని పెళ్లి చేసుకున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అద‌న‌పు క‌ట్నం కోసం త‌మ‌కు వ‌దిలించుకున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు చెప్పారు. అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

ఇవి కూడా చదవండి :

Maoist Encounter : తొమ్మిదికి చేరిన చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య!
BRS MLA Disqualification Case : అప్పటిలోగా తేల్చకపోతే చర్యలు : స్పీకర్ కు సుప్రీం డెడ్ లైన్!