25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్‌ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే

మహారాష్ట్రలో ఆహార పదార్ధాలు, ఉత్పత్తులు, గుట్కా, శీతల పానీయాల కంపెనీలపై తుకారాం ముండే కొరడా ఝళిపిస్తున్నారు. వేళ్లూనుకున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు. ముంబై కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ కంపెనీ అయిన పార్సి డెయిరీ ఫామ్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో తన బృందంతో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.90 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎఫ్.డీ.ఏ ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించి సీజ్ చేయించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్పత్తులు తయారు చేయడం లేదని, కల్తీ సరుకులు వినియోగిస్తున్నారని వెల్లడి కావడంతో ఫుడ్ బిజినెస్ లైసెన్స్ సస్పెండ్‌ చేశారు. డెయిరీ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల కంపెనీలు, రెస్టారెంట్లలో కల్తీ, నాణ్యత, పరిశుభ్రతను తెలుసుకునేందుకు జూలై 14, 15 తేదీలలో ఎఫ్.డీ.ఏ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలువురు వ్యాపారులు, కంపెనీలపై కేసులు నమోదు అయ్యాయి.

విధాత, హైదరాబాద్:

విధులు, నిజాయతీలో ఎక్కడా రాజీపడకుండా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా (1991 బ్యాచ్) పేరు విన్నాం. ఆయన తన మొత్తం సర్వీసులో సుమారు 66సార్లు బదిలీ అయ్యారంటే ప్రభుత్వ నిబంధనల పట్ల ఎంత నిక్కచ్చితనం ఉందో స్పష్టమవుతున్నది. తన సర్వీసులో ఎక్కడ కూడా ఆరు నెలలు, ఏడాదికి మించి పని చేయలేదు. ఖేమ్కా తరహాలోనే మహారాష్ట్రలో కూడా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే కూడా అటు పాలకులను ఇటు అక్రమార్కులను గడగడలాడిస్తున్నారు. కొరకరాని కొయ్యగా మారిన ముండేను ఎక్కడ కూడా ఆరు నెలలు, ఏడాది మించకుండా పాలకులు బదిలీలు చేస్తునే ఉన్నారు. మొత్తం పాతికేళ్ల సర్వీసులో 21 సార్లు బదిలీలు చేశారంటే ప్రభుత్వాలు ఎంతగా భయపడుతున్నాయనేది స్పష్టమవుతున్నది. రెండు నెలల క్రితం మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా తుకారాం ముండే పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే తనిఖీలు మొదలు పెట్టారు. రెండు నెలలుగా ఆయన నిర్వహిస్తున్న తనిఖీలతో కంపెనీ యజమానులు, బడా వ్యాపారులు భీతిల్లిపోతున్నారు. ఆందోళనకు గురైన వ్యాపారులు.. మంత్రులు, ముఖ్యమంత్రి ఇళ్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ వరుస దాడులతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, కాపాడాలని వేడుకుంటున్నారు. రెండు నెలల్లోనే తను అంటే ఏమిటో, ప్రభుత్వ అధికారికి ఏ విధమైన అధికారాలు ఉంటాయో ముండే రుచి చూపిస్తున్నారు. ఇక్కడికి బదిలీ కాక ముందు ఆయన పర్బనీ జిల్లా గార్డియన్ సెక్రెటగా పనిచేశారు.

ఎవరీ తుకారాం ముండే…

ఫిర్యాదు కోసం మూడు భాషల్లో వెబ్ పోర్టల్

ప్రతి పౌరుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా సరే తమకు తెలిసిన మూడు భాషలలో ఫిర్యాదు చేయవచ్చు. రాత పూర్వకంగానే కాకుండా వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వాయిస్ ద్వారా ఫిర్యాదు చేస్తే, ఏఐ సాంకేతికతతో ఆ వివరాలు అక్షరాల రూపంలోకి మారేలా ఏర్పాటు చేశారు. ఆహార ఉత్పత్తులతో పాటు కల్తీ మందులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ముంబై మహా నగరంలో చర్చి గేట్ పక్కనే ఉన్న రుస్తుం అండ్ కో ఐస్ క్రీమ్ ఫార్లర్ పై తుకారాం బృందం తనిఖీలు నిర్వహించింది. 73 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్లర్‌కు ముంబైలో ఎంతో పేరు ఉంది. ఇక్కడికి ఎక్కువగా ఐస్‌క్రీమ్‌, శాండ్‌విచ్‌ కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎఫ్.డీ.ఏ అధికారుల తనిఖీలలో అనేక లొసుగులు బయటపడ్డాయి. శుభ్రత లేని వాతావరణంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఎలుకలు, ఈగలు, దోమలు సంచరిస్తున్న వాతావరణంలో ఐస్‌క్రీమ్‌, శాండ్‌విచ్‌లను నిల్వ చేస్తున్నారని సంబంధిత సిబ్బందిపై తుకారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఫ్లేవర్లను ఐస్‌క్రీమ్‌లలో ఉపయోగిస్తున్నారని గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా పేరొందినదని తనిఖీ చేయకుండా వదిలివేయలేమని, పరిశుభ్రత, నాణ్యత పాటించాల్సిందేనని తుకారాం తనిఖీ సందర్భంగా యజమానికి స్పష్టం చేశారు. తదుపరి తనిఖీ సమయానికి సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ.. అప్పటి వరకు ఫుడ్ లైసెన్స్ సస్పెండ్‌ చేశారు.

ఛత్రపతి శంభాజీ నగర్‌లో కల్తీనూనెలపై ఉక్కుపాదం

ఛత్రపతి శంభాజీ నగర్‌లో వంట నూనెలు తయారు చేస్తున్న కంపెనీపై దాడులు నిర్వహించగా, నాణ్యతా ప్రమాణాలు లేని రూ.2.93 కోట్ల విలువైన వంట నూనెను కనుగొన్నారు. తుప్పు పట్టిన యంత్రాలు, పరిశుభ్రత లేని వాతావరణంలో నూనెను శుద్ధి చేస్తున్నట్లు వెల్లడి కావడంతో నూనెను పూర్తిగా జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో కల్తీ పన్నీర్ ఎక్కువగా హోటల్ యజమానులకు కొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ పన్నీరుతో తయారైన వంటకాలను తీసుకున్నవారు అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులను పరీక్షించగా 40 శాతం వరకు ప్రమాణాలకు దిగువగా ఉన్నాయని ముండే తెలిపారు. ఈ ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కేసులు నమోదు చేయడమే కాకుండా నేరం తీవ్రంగా ఉంటే అరెస్టులు కూడా చేయిస్తున్నారు. అక్రమాలకు పాల్పడేవారికి గట్టి సందేశం ఇచ్చే విధంగా తన మార్క్ పనితీరును తుకారాం ముండే చూపిస్తుండడంతో కల్తీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుట్కా తయారీని నిరోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 904 ప్రాంతాలలో మూకుమ్మడి సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉత్పత్తులు కనుగొన్నారు. రూ.34.66 కోట్ల విలువైన నిషేధిత పాన్ మసాలాలు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న పెప్పీకో, రెడ్ బుల్ కంపెనీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎనర్జీ డ్రింక్ పేరిట అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎనర్జీ డ్రింక్ మార్కెటింగ్ నిలిపివేయాలని, ఉత్పత్తి ఆపివేయాలని కంపెనీలకు స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కచ్చితంగా మంచినీరు ఉచితంగా అందుబాటులో పెట్టాల్సిందిగా యాజమాన్యాలకు సర్క్యులర్లు జారీ చేశారు. ఇదే కాకుండా ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థల కార్యకలాపాలపై నిఘా పెంచారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించే సంస్థల నుంచి ఫుడ్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. రెండు నెలల వ్యవధిలో అక్రమాలకు పాల్పడుతున్న 457 మంది వ్యాపారులు, యజమానులపై కేసులు నమోదు చేసి 42 వాహనాలు సీజ్ చేశారు.

Latest News