Telangana Cyber Crimes | భళారే విచిత్రం..! సైబర్ మోసాలకు గురైన వారిలో ఐటీ నిపుణులే ఎక్కువ
2023లో NCRB రిపోర్ట్ ప్రకారం సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ మెట్రో నగరాల్లో రెండో స్థానంలో ఉంది. బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్‌లు, డెబిట్-క్రెడిట్ కార్డు మోసాలు ఎక్కువగా నమోదయ్యాయి

Telangana Ranks Second in Cybercrime Cases in 2023:NCRB
సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం సైబర్ నేరాల్లో కర్ణాటక టాప్‌లో ఉంది. సైబర్ మోసగాళ్ల ఉచ్చుల్లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయిస్ పడుతున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ చీటర్స్.
దేశంలో సైబర్ క్రైమ్ 86, 240 కేసులు
2023లో దేశంలో 86,240 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2021 నుంచి ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2021లో 52,974 కేసులు నమోదయ్యాయి. 2022 నాటికి అవి 65,893కి పెరిగాయి.2023 నాటికి అవి 86,240కి చేరాయి. ఇక ఓటీపీ, ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలు, ఏటీఎం మోసాల వంటి కేసులు తెలంగాణలో 18, 326 నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 2023లో 21,889 కేసులు రికార్డయ్యాయి. దేశంలో కర్ణాటక టాప్ ప్లేస్ లో నిలిస్తే తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
సైబర్ నేరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?
2023 సంవత్సరంలో మొత్తం 3303 కేసులతో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక కేసులు బెంగళూరులో రికార్డయ్యాయి. బెంగుళూరులో మొత్తం 6423 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువగా 156 ఏటీఎం మోసాలకు సంబంధించినవి. 709 ఆన్ లైన్ మోసాలపై ఫిర్యాదు చేశారు. ఇక 282 ఓటీపీ మోసాలు నమోదయ్యాయి. ప్రతి సైబర్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన 760 మందిని కోర్టులు నిర్ధోషులుగా విడుదల చేసింది. అయితే 26 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది.
బ్యాంకు మోసాల్లో తెలంగాణ టాప్
బ్యాంకు మోసాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మొత్తం 1897 కేసులు నమోదయ్యాయి. 1900 మంది బాధితులుగా ఉన్నారు. మరో వైపు డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు తెలంగాణలో అత్యధికంగా నమోదయ్యాయి. 855 సంఘటనలు జరిగాయి. 861 మంది బాధితులున్నారు. వీటిలో హైదరాబాద్ లో 211 కేసులున్నాయి. ఆస్తి సంబంధమైన నేరాలకు సంబంధించి 5,598 కేసులు రికార్డయ్యాయి. ఈ కేసుల్లో 5742 మంది బాధితులున్నారు. ఇవన్నీ హైదరాబాద్ లో నమోదయ్యాయి.
ఆహార కల్తీలో తెలంగాణ నెంబర్ వన్
దేశంలోనే అత్యధికంగా కల్తీ ఆహారం లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు 2023లో తెలంగాణలో నమోదయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 382 కేసులు తెలంగాణలో రికార్డయ్యాయి. తెలంగాణలో నమోదైన 382 కేసుల్లో 218 హైదరాబాద్ లో నమోదయ్యాయి. 2023 లో ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 కింద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2022లో కల్తీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే టాప్ లో ఉంది. ఆ ఏడాది 1631 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 246 కేసులు రికార్డయ్యాయి.