Monkeys | కోతులకు ఆహారం పెడితే.. రూ. 5 వేల జరిమానా కట్టాల్సిందే..
Monkeys | కోతులే కదా అని ఆహారం పెడుతున్నారా..? అయితే మీరు జరిమానా కట్టాల్సిందే.. పర్యాటక ప్రాంతాల్లో కోతులకు ఆహారం పెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని డార్జిలింగ్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Monkeys | కోల్‌కతా : పలు ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది. అటవీ ప్రాంతాలను వదిలి జనావాసాల్లోకి కోతులు ప్రవేశించి స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో మనషులపై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి కోతులు. దీంతో కోతుల బెడదను నివారించేందుకు.. వాటికి ఆహారం పెడుతున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది ఓ మున్సిపాలిటీ.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్యాటక ప్రాంతం. ఇక్కడ కోతులు కూడా ఎక్కువే. అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన కోతులు డార్జిలింగ్‌లో మకాం వేశాయి. అయితే స్థానికులు ఆ కోతులకు ఆహారం పెడుతుండడంతో.. అవి అక్కడ్నుంచి కదలడం లేదు. ఈ క్రమంలో పర్యాటకుల చేతుల్లో ఉన్న ఆహార పదార్థాలు లాక్కునేందుకు కోతులు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఒక్కోసారి పర్యాటకులు ఇవ్వని పక్షంలో వారిపై దాడులు చేస్తున్నాయి. ఇలా పర్యాటకులే కాదు.. స్థానికులు కూడా కోతుల దాడులకు గురవుతున్నారు. తదనంతరం రేబిస్‌కు గురవుతున్నారు. ఈ కేసులు పెరిగి పోతుండడంతో.. డార్జిలింగ్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
కోతులకు ఆహారం అందించే వారు ఎవరైనా సరే.. అటు పర్యాటకులు, ఇటు స్థానికుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని డార్జిలింగ్ మున్సిపాలిటీ హెచ్చరించింది. కోతులకు ఆహారం అందించే వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలకు సంబంధించి ఇప్పటికే డార్జిలింగ్ వ్యాప్తంగా పోస్టర్లు అంటించామని, పర్యాటక ప్రదేశాల్లో విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.