ఇండియా-బీజేపీ తొలి ఫైట్‌ చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలు!

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ద్వారా ఇండియా కూటమి బీజేపీతో తొలి డైరెక్ట్‌ ఫైట్‌కు సిద్ధమవుతున్నదని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా అన్నారు

ఇండియా-బీజేపీ తొలి ఫైట్‌ చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలు!
  • కాంగ్రెస్‌ మద్దతుతో మేయర్‌ బరిలో ఆప్‌
  • గురువారం ఎన్నికలు..
  • లోక్‌సభ ఎన్నికలకు కర్టెన్‌ రైజర్‌
  • విజయం సాధించేది ఇండియా కూటమే
  • ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా

న్యూఢిల్లీ : చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ద్వారా ఇండియా కూటమి బీజేపీతో తొలి డైరెక్ట్‌ ఫైట్‌కు సిద్ధమవుతున్నదని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా అన్నారు. ఇది రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమికి పునాదిరాయి వంటిదని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురువారం జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ ఉమ్మడిగా పోరాడుతున్నాయని రాఘవ్‌ ఛద్దా చెప్పారు. ఇది రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కర్టెన్‌ రైజర్‌గా ఉండబోతున్నదని వ్యాఖ్యానించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ప్రకటన వెలువడి అనంతరం తమ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీని కలిశారని తెలిపారు.


ఆ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయని, ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని తీర్మానించారని వివరించారు. ఆప్‌ నుంచి మేయర్‌ అభ్యర్థి ఉంటారని, ఇద్దరు డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి ఉంటారని రాఘవ్‌ ఛద్దా తెలిపారు. కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున కుల్దీప్‌కుమార్‌ టిటా మేయర్‌ అభ్యర్థిగా ఉంటారు. కాంగ్రెస్‌ నుంచి గుర్‌ప్రీత్‌సింగ్‌ గాబి, నిర్మలాదేవి సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా బరిలో ఉంటారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విషయమై ఇండియా కూటమి నేతల సమావేశం సందర్భంగా చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదరడంతో ఎన్నిక ఇండియా కూటమికి, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పోరులో బీజేపీపై ఇండియా కూటమి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

35 మంది సభ్యులున్న చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒక బీజేపీ ఎంపీ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఓటింగ్‌ హక్కు కలిగి ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 13 మంది, కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం ఉన్నది.