విధాత : భారత నౌకాదళం బలోపేతం దిశగా దేశం కీలక ముందడుగు వేసింది. భారత నౌక దళం కోసం కొత్తగా రూపొందించిన మూడు యుద్ద నౌకలు ఐఎన్‌ఎస్ దుణగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్, ఐఎన్‌ఎస్ అగ్రయ్ లను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.శత్రువుల రహస్య ఎత్తుగడలను చిత్తు చేసేలా అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ మూడు యుద్ద నౌకలను ప్రధాని మోదీ కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని పేర్కొన్నారు. భారతీయ పారిశ్రామిక ప్రగతికి, ఇంజినీర్ల నైపుణ్యానికి, కార్మికుల కఠోర శ్రమకు యుద్ద నౌకల నిర్మాణం నిదర్శనం అని కొనియాడారు.
కొత్త యుద్ద నౌకల ప్రత్యేకతలు..
నీలగిరి శ్రేణి యుద్ద నౌకల క్రమంలో ఐఎన్‌ఎస్ దుణగిరియుద్ధనౌకను ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. ప్రాజెక్టు 17ఏ పేరిట నిర్మించిన నౌకను 2022 జులై 15న జలప్రవేశం చేయించారు. దీని పొడవు 149 మీటర్లు. అడ్వాన్స్‌డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్‌గా తీర్చిదిద్దారు. రాడార్, సెన్సర్‌లతో బహుముఖ పాత్ర పోషించేందుకు అనువుగా నిర్మించిన ఈ నౌక బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులను కలిగి ఉంది.
ఇక ఐఎన్‌ఎస్ సంశోధక్ నౌకను భారత నౌకాదళానికి సముద్ర భౌగోళిక, (హైడ్రోగ్రాఫిక్ సర్వే) సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, కచ్చితత్వ పరిమాణం వంటి అంశాలపై నివేదికల తయారీలో సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా నిర్మించారు. ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. 2023 జూన్ 13న జలప్రవేశం చేయించారు. పోర్టులు, లోతైన సముద్ర మార్గాలు, మారిటైం పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్, విపత్కర పరిస్థితుల్లో మానవీయ సాయానికి, రక్షణ చర్యలు చేపట్టేందుకు అనువుగా సంశోధక్ నిర్మాణం చేశారు.
ఐఎన్‌ఎస్ అగ్రయ్ కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ)లో యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్‌గా నిర్మించారు. ఇది 77.6 మీటర్ల పొడవుతో రూపొందించారు. 2024 మార్చి 13న జలప్రవేశం చేయించారు. తీర జలాల్లో ఆపరేషనల్ విధులకు అనువుగా ఈ యుద్ధనౌకను డిజైన్ చేశారు. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సమన్వయం చేసుకునేలా 88 శాతం ఆధునిక స్వీయ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. 30ఎంఎం నేవల్ సర్ఫేస్ గన్, వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకతగా వెల్లడించారు.
హిందూ మహాసముద్రంలో సరికొత్త సమీకరణాలు
పాకిస్థాన్ తమ నౌకాదళంలోకి కొత్తగా హంగోర్ శ్రేణి జలాంతర్గాములను (Submarines) సమకూర్చుకుంటుండటంతో హిందూ మహాసముద్రంలో నౌకదళ బలాబలాల సమీకరణలో భారత్, పాక్ ల మధ్య సరికొత్త సమీకరణలు చోటుచేసుకున్నాయి. చైనా నుంచి 8 హంగోర్ శ్రేణి సబ్‌మెరైన్ల కొనుగోలుకు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఒకటి ఇటీవల చైనా నుంచి పాక్ చేతికి వచ్చింది. హంగోర్ శ్రేణి జలాంతర్గాములతో దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుందని, వీటితో మేం బంగాళాఖాతంలోనూ మా సైనికశక్తిని బలోపేతం చేసుకుంటామని, ఇవి గేమ్‌ఛేంజర్ సబ్‌మెరైన్లు అని పాక్ నేవీ ఫోర్స్ అధికారులు ధీమా వెలిబుచ్చారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్దంలో భారత్ నేవీ ఫోర్స్ పాక్ యుద్ధనౌక పీఎన్‌ఎస్ ఘాజీని పేల్చేసిన అనంతరం పాకిస్తాన్ నౌకదళం బంగాళా ఖాతం వైపు చూడటం మానేసి..అరేబియా సముద్రానికే పరిమితమైంది. మళ్లీ ఇన్నాళ్లకు 55 సంతత్సరాల తర్వాత బంగాళా ఖాతం జలాల్లో పాకిస్తాన్ హంగోర్ శ్రేణి జలాంతర్గాములను మోహరించనుండటం గమనార్హం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల మధ్య బలపడిన సంబంధాలతో చైనా సహకారంతో పాకిస్తాన్ బంగాళాఖాతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో భారత్ సైతం తన నౌక దళం బలాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం
అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి బంగాళాఖాతం సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్‌కే ఉంది. తీర ప్రాంతం నుంచి సముద్రం లోపలికి 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ జలాలే. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. భారత్‌కు ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. కీలకమైన కమ్యూనికేషన్ లైన్లు ఉన్నాయి.
తూర్పు నావెల్ కమాండ్ ఇక్కడే ఉంటుంది. మన దేశ అణు జలాంతర్గాములు విశాఖ కేంద్రంగానే రూపొందుతాయి. మన జలాంతర్గాములను నిలిపి ఉంచే ‘ఐఎన్‌ఎస్ వర్ష’ కూడా ఇక్కడే ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.
అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ నేావీ ఫోర్స్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది.
A New Chapter Begins with the commissioning of powerful symbols of Maritime Strength.
Designed, built and integrated in India, Dunagiri, Agray, and Sanshodhak, showcase the power of #AatmanirbharBharat.
From Kolkata to the Indian Ocean, India sails forward with confidence.… pic.twitter.com/B03RXWkTIw
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) June 20, 2026
