Olympics | పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు మూడో కాంస్యం…ఆవిరైన నిఖత్ జరీన్ పతకం ఆశలు
పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు మరో పతకం వచ్చింది. యువ షూటర్ స్వప్నిల్ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

విధాత, హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు మరో పతకం వచ్చింది. యువ షూటర్ స్వప్నిల్ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఒక దశలో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగిన స్వప్నిల్ పోటీ సాగుతున్న కొద్ధి టాప్-3లోకి చేరుకుని చివరకు 451.4 పాయింట్లను సాధించి కాంస్యం అందుకొన్నాడు. చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ (461.3) పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నారు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ షూటింగ్ పోటీల్లో బోర్లా పడుకొని (ప్రోన్), మోకాళ్ల మీద (నీలింగ్), నిల్చొని (స్టాండింగ్) షూటింగ్ చేయాల్సివుండగా, స్వప్నిల్ మొత్తం 451.4 పాయింట్లు సాధించాడు. అందులో మోకాళ్లపై షూటింగ్‌లో 153.5 పాయింట్లు, ప్రోన్ విభాగంలో 156.8 పాయింట్లు. స్టాండింగ్‌లో141.1 పాయింట్లను (స్టేజ్ 2 ఎలిమినేషన్‌తో కలిపి) సాధించాడు. ఇప్పటిదాకా భారత్ మూడు కాంస్య పతకాలు గెలుచుకోగా, మూడు కూడా షూటింగ్ విభాగంలోనే కావడం విశేషం. ఇందులో పది మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో మనుభాకర్ వ్యక్తిగతం ఒక కాంస్యం, ప్రభుజోత్‌సింగ్‌తో కలిసి మరో కాంస్యం సాధించింది. ఇకపోతే పారిస్ ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అనూహ్యంగా చైనా బాక్సర్ వుహూ చేతిలో ఓటమి పాలైంది. మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్ నిఖత్‌పై 0-5 తేడాతో వు హు (చైనా) విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.