జులై 29వ తేదీని ప్రపంచ దేశాలు అంతర్జాతీయ పులుల దినోత్సవంగా పాటిస్తున్నాయి. ప్రకృతిలో ముఖ్యంగా అడవిలో జీవ వైవిధ్య పరిరక్షణలో పెద్ద పులుల పాత్ర నిర్ణయాత్మకమైంది. పులులను కాపాడటం అంటే ఒక జంతువును మాత్రమే రక్షించడం కాదు. అడవులను, నదులను, జీవవైవిధ్యాన్ని, చివరికి మన భవిష్యత్తునే కాపాడటం. అందుకే పులులను కాపాడిన భారత్, ప్రకృతిని కాపాడే మార్గాన్ని ప్రపంచానికి చూపించిన దేశంగా నిలిచింది. పులుల సంరక్షణ అనేది పర్యావరణానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల భవిష్యత్తుకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తుంటారు.
భారత్ లోనే 70శాతం..
పులుల సంరక్షణలో భారత్ సాధించిన విజయం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 70% మన దేశంలోనే ఉన్నాయన్న విషయం భారతదేశ ప్రజలకు గర్వకారణం. పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదు, మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక. పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను, భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం ప్రభుత్వం భావిస్తుంది. జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతున్న ఈ కాలంలో, సరైన ప్రణాళిక, ప్రభుత్వ సంకల్పం, శాస్త్రీయ విధానం, ప్రజల భాగస్వామ్యం ఉంటే అంతరించిపోతున్న జంతువులను కూడా తిరిగి పెంచవచ్చని భారత్ నిరూపించింది. పులుల సంఖ్య పెరగడం కేవలం వన్యప్రాణి సంరక్షణలో విజయమే కాదు..ప్రకృతిని కాపాడటం అంటే భవిష్యత్ తరాలను కాపాడటమేనని ప్రపంచానికి చెప్పిన బలమైన సందేశంగా నిలుస్తుంది.
2010లో 3,200..2022 లెక్కల్లో 5,700
2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన చారిత్రాత్మక “టైగర్ సమ్మిట్” నాటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 దేశాలలో 3,200 అడవి పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పులులున్న 13 దేశాలైన భారత్, రష్యా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, లావోస్, కంబోడియా, మయన్మార్లు ఒక్కతాటిపైకి వచ్చి ఒక సాహసోపేతమైన లక్ష్యాన్ని ప్రకటించాయి. “Tx2” అంటే 2022 నాటికి ప్రపంచ పులుల సంఖ్యను రెట్టింపు చేయడం. ఈ లక్ష్యాన్ని ప్రపంచానికి గుర్తు చేయడానికే జూలై 29ను అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్ణయించాయి. అప్పట్లో పులులు ఉన్న 13 దేశాలు కలిసి 2022 నాటికి వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు ప్రపంచంలోని అడవి పులుల సంఖ్య సుమారు 5,700కు చేరుకుంది. 1973లో ప్రారంభమైన ‘ప్రాజెక్ట్ టైగర్’. తొమ్మిది రిజర్వులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 18 రాష్ట్రాల్లో 58 పులుల అభయారణ్యాల ఏర్పాటుకు విస్తరించింది. ఇవి మొత్తం సుమారు 84,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2.56 శాతంగా ఉంది.
పులుల జనాభా వృద్దిలో కీలక ముందడుగు
దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ ప్రణాళికలను రూపొందించడం, అభయారణ్యాల నిర్వహణను పర్యవేక్షించడం, రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం వంటి బాధ్యతలను బలోపేతం చేసేందుకు 2006లో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) ఏర్పాటైంది. ప్రాజెక్ట్ టైగర్, ఎన్ టీసీఏ ల కృషితో దేశంలో 2006లో 1,411 పులులు మాత్రమే ఉండగా, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967 పులుల, 2022 నాటికి ఆ సంఖ్య 3,682కు చేరుకుంది. అంటే ప్రపంచంలోని ప్రతి 10 అడవి పులుల్లో దాదాపు 7 పులులు భారత అడవుల్లోనే సంచరిస్తున్నాయి. ప్రపంచ భూభాగంలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్న దేశం ఈ ఘనత సాధించడం ప్రకృతి సంరక్షణ చరిత్రలో అరుదైన విజయంగా నిలిచింది. అందుకే భారత్‌ను “పులుల రాజధాని”గా కూడా కొందరు పిలుస్తుంటారు. పులులు ఒక అడవి నుంచి మరో అడవికి సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన వన్యప్రాణుల కారిడార్లను కాపాడటం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ సహజ మార్గాలు దెబ్బతింటే పులుల దీర్ఘకాలిక మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. దేశంలో 2012-25 మధ్య మొత్తం 1581 పులులు వివిధ కారణాలలో మరణించాయి.
అతి పెద్ద అభయారణ్యం..నల్లమల నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
పులుల సంరక్షణలో దేశానికే తలమానికమైన నల్లమల రాష్ట్రంలోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 3727.82 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించింది. దేశ వ్యాప్తంగా 55 పులుల సంరక్షణ కేంద్రాలుండగా.. వాటిలో నల్లమల నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతిపెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. 2024 గణన ప్రకారం నల్లమలలో 87 పులులు ఉన్నట్లు జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) నిర్ధారించింది. ఇందులో మగవి 32, ఆడవి 40, నిర్ధారించనివి 4, యుక్తవయస్సు పిల్లలు 11 ఉన్నాయి. ఫొటోల ఆధారంగా ఆడ, మగ వాటిని గుర్తిస్తారు. ఈ ఏడాది తాజాగా చేపట్టిన గణనలో పులుల సంఖ్య 90కి పైగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్దదైన అమ్రాబాద్ అభయారణ్యాన్ని కేంద్రం పెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ వరకు 2,611 చదరపు కి.మీ. మేర ఉన్న అడవుల్లో పులుల సంరక్షణపైన ప్రభుత్వం దృష్టి సారించింది.ఇప్పటివరకు 44 పులులు ఉన్నట్లు తేల్చారు.
పులుల సంరక్షణలో కీలకంగా ఎన్టీసీఏ, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో
అడవుల పునరుద్ధరణ, అక్రమ వేట నియంత్రణ, అటవీ సిబ్బందికి ఆధునిక సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యలను ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చింది. పులుల సంరక్షణలో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ)తో పాటు వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అక్రమ వేట, వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఎం-స్ట్రైప్స్ అనే డిజిటల్ వ్యవస్థ ద్వారా జీపీఎస్ ఆధారంగా అటవీ సిబ్బంది పులుల కదలికలను నమోదు చేస్తున్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ ద్వారా సేకరించిన చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించి, ప్రతి పులిని దాని చారల ఆధారంగా గుర్తించే సాంకేతికతను వినియోగిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఆధారిత వన్యప్రాణుల సర్వే నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా భారత్ సొంతం చేసుకుంది. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్’ ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వేగా గుర్తింపు పొందింది. 2022లో తొలిసారిగా పులుల ఆహారంగా ఉండే జింకలు, అడవి దున్నలు వంటి శాకాహార జంతువుల జాతీయ సర్వే కూడా నిర్వహించడం విశేషం.
పులుల జనాభాలో మధ్యప్రదేశ్ టాప్
మధ్యప్రదేశ్ (“టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు), కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు పులుల జనాభాలో అగ్రస్థానంలో ఉన్నాయి. 2022పులుల జనాభా గణన ప్రకారం అత్యధికంగా 785 పులులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.ఈ రాష్ట్రంలో అత్యధికంగా 6 టైగర్ రిజర్వ్ జోన్లు ఉన్నాయి. కర్ణాటక 563 పులులతో దాని తర్వాతి స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లో 560 పులులు ఉన్నాయి. మహారాష్ట్రలో 444 పులులు నమోదు కాగా, తమిళనాడులో 2018 నాటి 264 పులుల సంఖ్య 306కు పెరిగి గణనీయమైన వృద్ధిని కనబరిచింది. అస్సాం, కేరళ, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా పులుల సంఖ్య గణనీయంగా ఉంది.
2026 అఖిల భారత పులుల జన గణన కార్యక్రమం దేశవ్యాప్తంగా అడవులు, అభయారణ్యాలు, పులుల కారిడార్లలో జనవరి ఆరంభంలో మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల పర్యవేక్షణ కార్యక్రమమైన భారత పులుల గణన ఇది ఆరవ విడత కావడం గమనార్హం. 2027 నాటికి ఈ సర్వే లెక్కలు వెల్లడికానున్నాయి.
గ్లోబల్ టైగర్ ఫోరం
ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ టైగర్ ఫోరం ద్వారా 13 పులుల దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోంది. నేపాల్, భూటాన్, రష్యా, మయన్మార్ తదితర దేశాలతో కలిసి సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంరక్షణ, అక్రమ వేట నిరోధానికి చర్యలు చేపడుతోంది. 2024లో భారతదేశంలోనే ప్రధాన కార్యాలయంతో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా పులులతో పాటు సింహం, చిరుత, మంచు చిరుత, చీతా వంటి ఏడు పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ప్రపంచ దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తోంది.
తగ్గిపోతున్న పులి ఆయుర్ధాయం
అడవిలో పులి ఆయుర్దాయం సాధారణంగా 10 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం జూ పార్కులలోని మాత్రమే ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా గుర్తించారు. పెద్ద పులి బాగా ఆకలితో ఉంటే.. ఒక్కసారి కూర్చుంటే సుమారు 18 నుంచి 25 కిలోలకుపైగా మాంసాన్ని తింటుంది. వారానికి ఒక్కసారే పెద్ద జంతువును తిన్న తర్వాత మళ్లీ వేటాడటానికి 5 నుంచి 7 రోజులు విరామం తీసుకుంటుంది. 10 సార్లు వేట ప్రయత్నాలు చేస్తే పులికి వేట చిక్కే అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుందని సమాచారం. బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా జంతువు తారసపడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలదు. నీటిలో పులి అద్భుతంగా ఈత కొడతుంది. నదిని దాటడానికి 6 నుంచి 20 కిలోమీటర్ల దూరమైనా ఈదుకుంటూ వెళ్తుంది. మాంసం తిన్న వెంటనే పులికి విపరీతమైన దాహం వేస్తుంది. తిన్న మాంసం అరగడానికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే వేట తర్వాతా నీళ్లను వెతుక్కుంటూ వెలుతుంది. వాతావరణాన్ని బట్టి రోజుకు10 నుంచి 20 లీటర్ల నీటిని తాగుతుంది. ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవి పరిరక్షించుకోవాల్సి ఉంటుందనేది శాస్త్రవేత్తలు అంచనావేశారు. అటవీ విస్తీర్ణం పెంచుకోవటమే తప్ప మరోమార్గం లేదని స్పష్టంచేస్తున్నారు.
అంతరించిపోతున్న పులుల జాతులు
పులుల్లో 41 రకాల ఉప జాతులున్నాయి. ప్రస్తుతం వాటిలో బెంగాల్ టైగర్, అమూర్ టైగర్, దక్షిణ చైనా, సుమత్రాన్, ఇండో చైనీస్, మలయన్ రకాల పులులు ఉన్నాయి. కెస్పియన్, జవాన్, బాలి అనే 3 రకాల పులులు ఇది వరకే అంతరించిపోయాయి.పశ్చిమబెంగాల్ , బంగ్లాదేశ్‌ల్లో విస్తరించిన సుందర్‌బన్ అడవుల్లో జీవించే బెంగాల్ టైగర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చే 50 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న పులి జాతులు రక్షించుకోవడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నా.. చాలా దేశాల్లో పులుల గణాంక వివరాలు లేకపోవటం సమస్యగా మారింది. రష్యాలోని సైబీరియన్ టైగర్ (అము టైగర్), ఇండోనేషియాలోని సుమత్రన్ టైగర్ ఇప్పటికీ తీవ్ర ప్రమాదపు అంచున ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఒకప్పుడు తిరుగాడిన బాలి టైగర్, జావా దీవిలో జావా టైగర్, ఈ రెండు జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. కంబోడియా, వియత్నాం, లావోస్ దేశాల్లో అడవి పులులు ఇప్పటికే అంతరించిపోయాయి.
నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే లక్ష్యం: పవన్ కల్యాణ్
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 5,442.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్- పులులతోపాటు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, శాకాహార జంతువులు మరియు వందలాది వన్యప్రాణులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని NSTR–శేషాచలం పరిధిలో 68 పులులు, 11 పులి పిల్లలు నమోదుకావడం సంతోషకర విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలకు నిదర్శనం అని పేర్కొన్నారు. నల్లమల అడవుల్లో పులి గర్జన శాశ్వతంగా వినిపించే లక్ష్యంతో మనమందరం కృషి చేయాలని పిలుపునిస్తున్నానని తెలిపారు.
తూర్పు కనుమల ప్రాంతంలో పులుల జన్యు వైవిధ్యాన్ని, జనాభాను పెంపొందించేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ పరిధి నుంచి రెండు ఆడ పులులను, మధ్యప్రదేశ్ నుంచి మరో రెండు ఆడ పులులను తీసుకురావడానికి సూత్రప్రాయ అంగీకారం లభించడానికి సహకరించిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పవన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పులుల సంరక్షణ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. అలాగే నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కు పెంచుతున్నాము. దీనివల్ల భద్రత, నిఘా, సమాచార సేకరణ, అత్యవసర స్పందన సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయి. అదే సమయంలో సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులందరికీ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 70% మన దేశంలోనే ఉన్నాయన్న విషయం భారతదేశ ప్రజలకు గర్వకారణం. ప్రకృతితో సామరస్యంగా జీవించే మన శతాబ్దాల నాటి సంస్కృతి స్ఫూర్తితో, మన ప్రజల సమిష్టి సంకల్పంతో భారతదేశం పులుల సంరక్షణ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పులుల సంరక్షణను బలోపేతం చేసే శాస్త్రీయ ఆధారిత సంరక్షణ, సామాజిక భాగస్వామ్యం మరియు సుస్థిర అభివృద్ధి పట్ల మా నిబద్ధతను కూడా మేము పునరుద్ఘాటిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
Some homes are built with walls. Others are shaped by forests, rivers and the rhythm of the wild. India is one such home, where every tiger trail leads to a story waiting to be discovered.
This International Tiger Day, follow the trails less travelled, witness these majestic… pic.twitter.com/flLfgGh7Og
— Incredible!ndia (@incredibleindia) July 29, 2026