జేపీ నడ్డా మోదీ క్యాబినెట్‌లో.. మరి బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు?

మోదీ 3.0 క్యాబినెట్‌లోకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారన్న చర్చ నడుస్తున్నది. జూన్‌ 10న తన మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించిన మోదీ.. జేపీ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు.. రసాయనాలు, ఎరువుల శాఖను అప్పగించారు.

జేపీ నడ్డా మోదీ క్యాబినెట్‌లో.. మరి బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు?

న్యూఢిల్లీ : మోదీ 3.0 క్యాబినెట్‌లోకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారన్న చర్చ నడుస్తున్నది. జూన్‌ 10న తన మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించిన మోదీ.. జేపీ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు.. రసాయనాలు, ఎరువుల శాఖను అప్పగించారు. ప్రభుత్వంలో నడ్డా భాగస్వామి అయిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని బీజేపీ ఎన్నుకోవాల్సి ఉన్నది. బీజేపీ సీనియర్‌ నేతలు సీఆర్‌ పాటిల్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, భూపేందర్‌ యాదవ్‌ కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వ్యూహాత్మకంగానే వారిని ప్రభుత్వంలోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.

వినోద్‌ తావ్డే
మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత వినోద్‌ తావ్డే. ఆయన ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఓబీసీ వర్గానికి చెందిన తావ్డే.. బీహార్‌లో పార్టీ ఇన్‌చార్జిగా ఉండి.. అక్కడ పార్టీకి ఘన విజయాలు సాధించారు. తావ్డేను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేస్తే బీజేపీకి ఉన్న ఓబీసీ వ్యతిరేక ముద్ర చెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తావ్డేను అధ్యక్షుడిని చేస్తే రాష్ట్రంలో ఓబీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తావ్డేకు ఉన్న మరాఠా కమ్యూనిటీ నేపథ్యం కూడా కష్టకాలంలో పార్టీకి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

సునీల్‌ బన్సల్‌
సునీల్‌ బన్సల్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన హోం మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. బన్సల్‌ గతంలో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ఇన్‌చార్జిగా అమిత్‌షా వ్యవహరిస్తే.. సహ ఇన్‌చార్జ్‌గా బన్సల్‌ ఉన్నారు. ఆ ఎన్నికల్లో యూపీలో బీజేపీ గణనీయమైన విజయాలు సొంతం చేసుకున్నది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు కూడా బన్సల్‌ యూపీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ లోక్‌సభ ఎన్నికలకు ఆయన ఒడిశా, తమిళనాడు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. తెలంగాణలో సీట్లు పెంచుకున్న సంగతి తెలిసిందే.

బీఎల్‌ సంతోష్‌
బీఎల్‌ సంతోష్‌ కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌)గా ఉన్నారు. ఆరెస్సెస్‌కు ఆయన పెద్ద ప్రచారకుడు కూడా. అయితే.. ఆయనకు బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు గట్టి వ్యతిరేకతే రావచ్చని చెబుతున్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించలేక పోయారని బీజేపీలోనే విమర్శలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో ఆయనకు ఉన్న విభేదాలు కూడా ఆయన అవకాశాలను దెబ్బతీయొచ్చని చెబుతున్నారు.

ఓమ్‌ మాథుర్‌
అధ్యక్ష రేసులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజస్థాన్‌ నేత ఓం ప్రకాశ్‌ మాథుర్‌ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన మోదీకి పార్టీలో కుడిభుజంగా చెబుతారు. చండీగఢ్‌ అసెంబ్లీ ఎన్నిలకు ఇన్‌చార్జిగా ఆయన పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బన్సల్‌తోపాటు మాథుర్‌ కృషి కూడా ఉన్నదని చెబుతారు.

కే లక్ష్మణ్‌
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేరు కూడా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆయన బీజేపీ ఓబీసీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఓబీసీ అయిన లక్ష్మణ్‌ను బీజేపీ అధ్యక్షుడిని చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ వర్గంలో పార్టీని విస్తరించేందుకు అవకాశం కలుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. లక్ష్మణ్‌కు తెలంగాణ వెలుపల పెద్దగా పట్టు లేకపోవడం ఆయన మైనస్‌ పాయింట్‌ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అనురాగ్‌ ఠాకూర్‌
బీజేపీ అధ్యక్ష రేసులో హామీపూర్‌ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ పేరు కూడా చక్కర్లు కొడుతున్నది. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన ఠాకూర్‌.. ఈసారి మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోలేక పోయారు. గత ప్రభుత్వంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కుమారుడు అనురాగ్‌. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీలను బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వారసుడికి బీజేపీలో అవకాశం ఇస్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు ఒక వార్తాసంస్థతో మాట్లాడిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అజయ్‌ సెహ్రావట్‌.. ‘మా పార్టీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌.. అందరూ ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారు కాదు. మొత్తం పార్టీ ఒక వ్యక్తి చేతిలో పెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. తేజస్వియాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, గాంధీలను చూడండి.. వారంతా యావత్‌ పార్టీలను చేతుల్లోకి తీసుకున్నారు’ అని చెప్పడం ప్రస్తావనార్హం. ఈ పరిస్థితిలో అనురాగ్‌ ఠాకూర్‌ను రాజకీయ వారసత్వం అంశాన్ని పక్కనపెట్టి అధ్యక్ష పదవి ఇస్తారా? అనే సందేహాలు ఉన్నాయి.
బీజేపీకి అధ్యక్షులుగా పనిచేసినవారి వివరాలు..

అటల్ బిహారీ వాజ్‌పేయి (1980-86)
లాల్ కృష్ణ అద్వానీ (1986-91)
మురళీ మనోహర్ జోషి (1991-1993)
లాల్ కృష్ణ అద్వానీ (1993-98)
కుశభవ్‌ ఠాక్రే (1998-2000)
బంగారు లక్ష్మణ్ (2000-01)
జానా కృష్ణమూర్తి (2001-02)
వెంకయ్య నాయుడు (2002-04)
లాల్ కృష్ణ అద్వానీ (2004-05)
రాజ్‌నాథ్ సింగ్ (2005-09)
నితిన్ గడ్కరీ (2009-13)
రాజ్‌నాథ్ సింగ్ (2013-14)
అమిత్ షా (2014-20)
జగత్ ప్రకాష్ నడ్డా 2020 నుంచి కొనసాగుతున్నారు.