KANGANA-FARM LAWS । తప్పైపోయింది.. క్షమించండి.. వ్యవసాయ చట్టాలను మళ్లీ తేవాలన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న కంగన
రైతుల ఉద్యమం(farmers' protest)పై నోరుపారేసుకోవడం కంగనకు ఇదే మొదటిసారి కాదు. నెల రోజుల క్రితం రైతుల ఆందోళనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగన.. హింస, లైంగిక దాడులతో ఆ నిరసనలను ముడిపెట్టారు. అప్పట్లో కూడా బీజేపీ తలపట్టుకోవాల్సి వచ్చింది.

KANGANA-FARM LAWS । 2021లో రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను (farm laws) మళ్లీ తేవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (BJP MP Kangana Ranaut) తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దేశంలోని వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలతోపాటు సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు వచ్చిన నేపథ్యంలో కంగన తప్పైపోయిందంటూ (regret) లెంపలేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly) నేపథ్యంలో కంగన చేసిన వ్యాఖ్యలు పార్టీకి పెను విఘాతంగా పరిణమించే అవకాశాలు ఉండటంతో రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు ఆమెతో క్షమాపణ చెప్పించినట్టు తెలుస్తున్నది.
ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్లో (major protest by the farmers) ఎక్కువ మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. దాదాపు ఏడాదిపాటు ఢిల్లీ శివార్లలో చారిత్రాత్మక ఆందోళనకు దిగడంతో కేంద్రం వెనక్కు తగ్గి, ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు (repealed) ప్రకటించింది. ఈ తరుణంలో మళ్లీ కంగన ఆ వివాదాన్ని రేకెత్తించడం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. కంగనా రనౌత్‌ను బీజేపీ సస్పెండ్ చేయాలన్న డిమాండ్లూ వచ్చాయి. అయితే.. తన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో స్పందించిన కంగన.. ఎక్స్‌లో ఒక పోస్టు పెడుతూ.. తన అభిప్రాయాలు పూర్తిగా తన వ్యక్తిగతమేనని, అవి బీజేపీ అభిప్రాయాలు కావని వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు కంగన రనౌత్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌భాటియా చెప్పారు. వ్యవసాయ చట్టాలకు కంగన మద్దతు పలకడాన్ని తిరస్కరించారు. ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు అధికారం లేదన్న భాటియా.. ఆమె వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయాలు కావని స్పష్టం చేశారు.
ఇక తన పోస్టులో వివరణ ఇచ్చుకున్న కంగన.. ‘వ్యవసాయ చట్టాలపై నా అభిప్రాయాలు వ్యక్తిగతీం. అవి ఆ బిల్లులపై పార్టీ వైఖరికి ప్రాతినిథ్యం వహించవు’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఒక వీడియోను కూడా పోస్టు చేశారు. ‘రైతులు ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మాలో చాలా మంది వారికి మద్దతు పలికాం. అయితే.. గొప్ప సున్నితత్వం, సానుభూతితో మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు ఆ చట్టాలను ఉపసంహరించారు. కళాకారిణిగానే కాకుండా నేనొక బీజేపీ సభ్యురాలినని నేను గుర్తుంచుకోవాలి. నా అభిప్రాయాలు నా అభిప్రాయాలు వ్యక్తిగతంగా కాకుండా.. పార్టీ వైఖరిగా ఉండాలి’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు. మంగళవారం నాడు మండీ జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన కంగన.. వ్యవసాయ చట్టాలకు కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే వ్యతిరేకత వ్యక్తమైందని వ్యాఖ్యానించారు. ‘భారతదేశ ప్రగతిలో రైతులు బలమైన స్తంభాలవంటివారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు. రైతుల ప్రయోజనాల రీత్యా వాటిని మళ్లీ తీసుకురావాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆమె చెప్పారు.
కంగన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువచ్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదనేందుకు కంగన వ్యాఖ్యలు సంకేతాలని విమర్శించింది. వీటికి హర్యానా ఎన్నికల్లో గట్టి సమాధానం ఇస్తారని పేర్కొన్నది.
అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ అధిష్ఠానం.. అటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కంగనను ఆదేశించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. రైతుల ఉద్యమం(farmers’ protest)పై నోరుపారేసుకోవడం కంగనకు ఇదే మొదటిసారి కాదు. నెల రోజుల క్రితం రైతుల ఆందోళనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగన.. హింస, లైంగిక దాడులతో ఆ నిరసనలను ముడిపెట్టారు. అప్పట్లో కూడా బీజేపీ తలపట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెను పిలిపించి మాట్లాడారు కూడా. ఎంపీ వ్యాఖ్యలతో బీజేపీ హిమాచల్ శాఖ కూడా దూరం పాటించింది.