Ranya Rao: రన్యారావు ఇంటరాగేషన్‌లో నివ్వెరబోయే నిజాలు! ఒంటిపై బంగారం బార్స్.. అయినా సెక్యూరిటీ చెక్ దాటి
బంగారం అక్రమంగా తరలిస్తూ కన్నడ సినీ నటి, కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె రన్యారావు ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆమెను డీఆర్ ఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తన అసలు తండ్రి ఎవరో.. అనే విషయంతోపాటు ఈ విచారణ సందర్భంగా రన్యారావు అనేక కీలక అంశాలను వెల్లడించినట్టు తెలుస్తున్నది.

Ranya Rao : 14.8 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తూ కన్నడ సినీ నటి, కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె రన్యారావు ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆమెను డీఆర్ ఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తన అసలు తండ్రి ఎవరో.. అనే విషయంతోపాటు ఈ విచారణ సందర్భంగా రన్యారావు అనేక కీలక అంశాలను వెల్లడించినట్టు తెలుస్తున్నది. తను ఎక్కడెక్కడకు తిరిగింది.. అన్నీ పూసగుచ్చినట్టు బయటపెట్టిందని సమాచారం. తన శరీరంపై 17 కిలోల గోల్డ్ బార్స్‌ను తీసుకు వచ్చినట్టు విచారణలో వెల్లడించిన రన్యారావు.. తన అంతర్జాతీయ ట్రిప్పులపై ఫుల్ డిటెయిల్స్ తెలిపినట్టు ఎన్డీటీవీ కథనం పేర్కొన్నది. నేను యూరప్, అమెరికా, మిడిలీస్ట్‌తోపాటు దుబాయి, సౌదీ అరేబియాలకు ప్రయాణించాను. తగినంత విశ్రాంతి లేని కారణంగా నేను ఇప్పుడు అలిసిపోయి ఉన్నాను.. అని ఆమె తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నది.
తన అసలు తండ్రి కేఎస్ హెగ్డేశ్ అని, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారని రన్యారావు వెల్లడించినట్టు సమాచారం. తన భర్త జతిన్ హుక్కేరి ఒక ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నది. తన విచారణ పారదర్శకంగా ఉన్నదని, తాను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగి ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదని కూడా స్పష్టం చేసింది. విచారణ సమయంలో తనకు ఫుడ్ అందించారని, కానీ, ఆకలిగా లేకపోవడంతో తాను తీసుకోలేదని తెలిపింది. పక్కా సమాచారంతో రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ ఐ) అధికారులు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె నుంచి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె నివాసాల్లో జరిపిన సోదాల్లోనూ పెద్ద మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేశారు.
ఇలా స్మగుల్ చేసింది..
బంగారం బార్స్‌ను ఆమె తన శరీరానికి తగిలించుకుని, అవి కనిపించకుండా దుస్తులు ధరించిందని డీఆర్ ఐ వర్గాలు తెలిపాయి. గత ఒక్క సంవత్సరంలోనే ఆమె 30 సార్లు దుబాయికి వెళ్లివచ్చింది. డీజీపీ సవతి కుమార్తె కావడంతో ఆమెకు వీఐపీ హోదా ఉన్నది. దీనితో ఎయిర్‌పోర్టుల్లో రెగ్యులర్ ప్యాసింజర్ చెకప్స్‌ను రన్యారావు తప్పించుకోగలిగింది. అయితే.. ఆమె కార్యకలాపాలతో తనకేమీ సంబంధం లేదని ఆమె సవతి తండ్రి, డీజీపీ కే రామచంద్రరావు చెబుతున్నారు. జతిన్ హుక్కేరీని ఆమె వివాహం చేసుకున్న దగ్గర నుంచీ తన వద్దకు రాలేదని, టచ్‌లో లేదని తెలిపారు. డీఆర్ ఐ అధికారులు ఆమె నివాసంలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.