కాన్పూర్-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై టోల్ రద్దు

రూ.4,200 కోట్లతో నిర్మించిన కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన నెలలోపే గుంతలు, కుంగిపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వసూళ్లు తాత్కాలికంగా నిలిపివేసింది. నిర్మాణ సంస్థపై మూడేళ్ల నిషేధం విధించి అధికారులపై చర్యలు తీసుకుంది.

టోల్ రద్దుతో రెట్టింపు అయిన వాహనాల రాకపోకలు
ప్రారంభించిన నెల లోపే గుంతలు, కోతలు
రూ.4,200 కోట్లతో ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం
మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీ పై నిషేధం
సెక్యురిటీ డిపాజిట్ నుంచి రెండు శాతం సొమ్ములు జప్తు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రూ.4,200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే ను ప్రారంభించిన మూడు వారాలకే మట్టి కుప్పల దిబ్బగా మారింది. గోతులు ఏర్పడ్డం, నెర్రెలు బారడం, కుంగిపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టులో లోపాలకు బాధ్యులైన ముగ్గురు ఇంజినీరింగ్ అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈ ఎక్స్ ప్రెస్ వే పై టోల్ వసూలు ను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచిత్రమేంటే టోల్ రద్దు చేసిన తరువాత వాహనాల రద్దీ పెరగడం విశేషం.

కాన్పూర్-లక్నో ఎక్స్ ప్రెస్ వే ను జూలై 13వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రారంభించారు. 63 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వే కు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. ఎక్స్ ప్రెస్ వే కు పీఎన్సీ ఇన్ ఫ్రా టెక్ లిమిటెడ్ కాంట్రాక్టు ఏజెన్సీ గా వ్యవహరించింది. వాహనాల రాకపోకలను అనుమతించిన తరువాత జూలై 26వ తేదీ నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డం, కుంగిపోవడం, అక్కడక్కడ వాహనాలు అకస్మాత్తుగా జారడం జరిగింది. దీంతో పలువురు వాహనదారులు భయాందోళనకు గురై రోడ్డు ఎక్కాలంటేనే వణికిపోయారు. ఈ సమస్యను పలువురు వాహనదారులు ఎదుర్కోవడంతో ఎన్ హెచ్ఏఐ రంగంలోకి దిగింది. ఐఐటీ ఖరగ్ పూర్ నిపుణులతో సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.3 కోట్ల వ్యయంతో గుంతలు పూడ్చడం, కోతకు గురైన రోడ్డును పునర్ నిర్మాణం చేయాలని సదరు నిర్మాణ సంస్థ ను ఆదేశించింది. మరమత్తు పనులు పూర్తయ్యే వరకు టోల్ ఛార్జీలు కూడా చెల్లించేది లేదని, అప్పటి వరకు నష్టం భరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నావ్ లోని కొర్రాయి ప్రాంతంలో మూడు వందల మీటర్ల పొడవునా వాహనాలు నడపలేకపోతున్నామని, జారుతున్నాయంటూ పలువురు సోషల్ మీడియాలో జూలై 26వ తేదీన వీడియోలు షేర్ చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ నాసిరకం పనులు చేయడం మూలంగానే ఈ దుస్థితి దాపురించిందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మాత్రమే ప్రస్తుతం ట్రాఫిక్ ను మళ్లించారు. ఫిర్యాదులు రావడంతో ఎన్ హెచ్ఏఐ అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాజెక్టు మేనేజర్ తో పాటు ఇండిపెండెంట్ ఇంజినీర్, రెసిడెంట్ ఇంజినీర్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఏజెన్సీకి స్పష్టం చేసింది. ఇదే కాకుండా వచ్చే మూడేళ్ళ పాటు ఎన్ హెచ్ఏఐ పనుల్లో పాల్గొనకుండా, టెండర్ వేయకుండా సదరు నిర్మాణ సంస్థ పీఎన్సీ ఇన్ ఫ్రా టెక్ ప్రైవేటు లిమిటెడ్ పై నిషేధం విధించింది. దీంతో పాటు పనితీరులో విఫలం అయినందుకు సెక్యురిటీ డిపాజిట్ నుంచి రెండు శాతం సొమ్ములు జప్తు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇండిపెండెంట్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్న థీమ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ గుర్తింపు ఎందుకు రద్ధు చేయకూడదో తెలియచేయాలంటూ నోటీసులు జారీ చేసింది. నాసిరకం నిర్మాణ పనులు చేపట్టినా నిర్లక్ష్యం వహించినందుకు గతంలో పనిచేసిన ప్రాజెక్టు డైరెక్టర్ సౌరభ్ చౌరసాయా పై ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రకాశ్ వర్మ విధుల్లో నిర్లక్ష్యం వహించనట్లు తేలడంతో ఆయనను మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ ఎన్ హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నాసిరకం పనులుపై ఎన్ హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్ గౌతమ్ విశాల్ చరణ్ పహారీ మాట్లాడుతూ, ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు చేపట్టామని, నాణ్యతా లోపాలు ఉన్న ప్రాంతంలో మరమత్తులు పూర్తి చేశామన్నారు. సాంకేతిక కమిటీని కూడా రంగంలోకి దింపి, ప్రాథమిక నివేదిక కూడా తెప్పించామన్నారు. వాహనదారుల రక్షణ కోసం ట్రాఫిక్ ను మళ్లించామన్నారు. ఐఐటీ సాంకేతిక నిపుణుల కమిటీకి ప్రొఫెసర్ కేఎస్ రెడ్డి నేతృత్వం వహించారని, పూర్తి నివేదిక త్వరలో సమర్పిస్తారన్నారు. ఎక్కడ లోపాలు ఉన్నాయనేది లోతుగా అధ్యయనం చేసే పనిలో కమిటీ ఉందన్నారు. దీంతో పాటు ఎన్ హెచ్ఏఐ కూడా లేజర్ ప్రొఫిలో మీటర్ తో పరీక్షలు చేస్తున్నదన్నారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి కాన్పూర్ పారిశ్రామిక ప్రాంతానికి సరకు రవాణాను వేగిరం చేసేందుకు ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 60 నిమిషాలకు తగ్గించి, ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించారు. ఎక్స్ ప్రెస్ వే పనుల్లో నాణ్యత లోపించిందని, రోజుల వ్యవధిలో కుంగిపోతున్నదంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 17 రోజుల వ్యవధిలో రెండు సార్లు మరమత్తులు చేపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అవినీతి కి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం నిదర్శనమని ఉత్తరప్రదేశ్ పీసీసీ విమర్శలు గుప్పించింది.

Latest News