బీఎస్-3 వాహనాల్లో ఆ పార్టులను మార్చాల్సిందే: కేంద్ర మంత్రి గడ్కరీ

E20 పెట్రోల్ వినియోగంతో కొత్త వాహనాలకు ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే 2005-2016 మధ్య తయారైన BS-3 వాహనాల్లో కొన్ని రబ్బర్ భాగాలను మార్చాలని సూచించారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 29, 2026, 5:48 pm IST
Read Time: 3 mins
బీఎస్-3 వాహనాల్లో ఆ పార్టులను మార్చాల్సిందే: కేంద్ర మంత్రి గడ్కరీ

E20 పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. E20 పెట్రోల్ వాడకంపై తలనెత్తుతున్న సందేహాలపై రాజ్యసభలో గడ్కరీ సమాధానం ఇచ్చారు.

పాత వాహనాల్లో E20 ఇంధనాన్ని వాడేందుకు.. ఎటువంటి ఇంజిన్ మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్ 1, 2005 నుంచి 2016 వరకు మానుఫ్యాక్చర్ అయిన బీఎస్‌-3 వాహనాల్లో E20 పెట్రోల్‌ వాడితే.. కొన్ని రబ్బర్‌ భాగాలు, గాస్కెట్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సాధారణ సర్వీసింగ్ సమయంలోనే వీటిని సులభంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. సైంటిఫిక్‌గా అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు, డ్యూరబిలిటీ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దశలవారీగా E20 ఇంధన వినియోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిందని మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు వివరించారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), ఐఐపీ డెహ్రాడూన్, సియామ్ (SIAM), ఏఆర్‌ఏఐ (ARAI) వంటి ప్రముఖ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన విస్తృత పరిశోధనల్లో కార్లు, బైక్‌ల ఇంజిన్లలో E20 ఇంధనం వినియోగం కోసం ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేలిందని నితిన్ గడ్కరీ సభలో ప్రస్తావించారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వాహన పనితీరు, స్టార్టింగ్, మెటల్,ప్లాస్టిక్ విడిభాగాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని అధ్యయనాలు స్పష్టం చేశాయన్నారు. E20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలపై గడ్కరీ స్పందిస్తూ..వాహనాల మైలేజ్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం ఇథనాల్ ఇంధనం వల్ల మాత్రమే మైలేజ్ మారదని వాహన తయారీదారులు, టెస్టింగ్ ఏజెన్సీలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు.