కర్ణాటక కేబినెట్ విస్తరణతో భగ్గుమన్న అసమ్మతి..తెలంగాణకు సెగలు!

కర్ణాటక కేబినెట్ విస్తరణతో కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికల మధ్య తెలంగాణ కేబినెట్ విస్తరణపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేపట్టిన కేబినెట్ విస్తరణ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసమ్మతిని రాజేసింది. మంత్రి పదవులు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు చేయగా..మరికొందరు కూడా రాజీనామా యోచనలో ఉండటం సీఎం డీకే శివకుమార్ కు తలనొప్పిగా మారింది. పార్టీ హైకమాండ్ అనుమతితో 20మందిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకోవాలని భావించిన డీకే..చివరి నిమిషంలో మాజీ సీఎం సిద్దరామయ్య హెచ్చరికలతో ఏకైక మహిళా ఎమ్మెల్యే గాయత్రి శాంతేగౌడను మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జాబితా నుంచి తప్పించాల్సి వచ్చింది. దీంతో డీకే మంత్రి వర్గంలో మహిళా మంత్రి లేకుండా పోయారు. అలాగే 20మంది జాబితాలో ముందుగా పేర్కొన్న మంకాశ్ వైద్యకు బదులుగా ఎస్ఎస్.మల్లిఖార్జన ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. సిద్దరామయ్య నుంచి అధికార మార్పిడిలో భాగంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ తొలి విడతగా తనతో పాటు 14మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 19మందితో మంత్రివర్గ విస్తరణ చేశారు. దీంతో డీకే మంత్రివర్గం సంఖ్య 33కు చేరింది.

20మంది సీనియర్లకు మంత్రి పదవులు దక్కకపోవడంతో వారంతా డీకే శివకుమార్ పై ఆగ్రహంతో ఉన్నారు. యశ్వంత్ రాయగౌడ, వి.పాటిల్ , బేలూరు గోపాలకృష్ణ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. మరింత మంది ఎమ్మెల్యేలు రాజీనామా యోచన చేస్తుండటం ఇటు డీకేకు, అటు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా తయారైంది.

రాజీనామాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..

మంత్రి పదవులు దక్కలేదంటూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తామన్న నేతల హెచ్చరికలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం డీకే శివకుమార్ కు అత్యవసరంగా ఫోన్ చేసి.. రాజీనామా హెచ్చరికలు చేసిన నేతల వివరాలు పంపించాలని ఆదేశించడం సంచలనం రేపింది. మంత్రి పదవి దక్కని వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎవరైనా బెదిరింపు రాజీనామాలకు పాల్పడితే వారి రాజీనామాలను ఆమోదించాలని హైకమాండ్ సీఎం డీకే శివకుమార్ కు స్పష్టమైన సూచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ క్రమశిక్షణకు, మంత్రివర్గం కూర్పులో ప్రభుత్వ స్వేచ్చకు రాజీనామా బెదిరింపులు విరుద్దం అని, ఈ తరహా అసమ్మతి రాజకీయాలను ఉపేక్షించరాదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఎఫెక్ట్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ విస్తరణ ప్రక్రియతో పార్టీలో అసమ్మతి రేగడం కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తుంది. తెలంగాణలోనూ కేబినెట్ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని నెలలుగా హైకమాండ్ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోనూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, వివిధ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం సహా 16మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పనితీరు సరిగా లేనటువంటి మంత్రులలో ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించడంపైన…పలువురి శాఖలలో మార్పులు చేయడంపైన సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రాంమోహన్ రెడ్డి, ఎస్టీ కోటాలో నేనావత్ బాలునాయక్, రామచంద్రనాయక్‌, ఇతర సామాజిక వర్గాల నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆది శ్రీనివాస్‌, మధన్‌మోహన్‌ లు, ఎమ్మెల్సీ విజయశాంతి, జెన్-జీ నినాదంతో అనిరుధ్ రెడ్డి వంటి వారు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు.

అయితే కర్ణాటకలో సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ విస్తరణ వ్యవహారం అసమ్మతి కుంపట్లను రాజేయడంతో తెలంగాణలో కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడే పరిస్థితి నెలకొంది. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారాన్ని మరింత అచితూచి చేపట్టాలని సీఎం రేవంత్ సహా పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరికొంత కాలం వాయిదా పడనుందని సమాచారం. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగస్టు 20నుంచి సెప్టెంబర్ 8వరకు విదేశీ పర్యటనకు వెళ్లనుండటం, సెప్టెంబర్ లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ వంటి కారణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest News