KEJRIWAL RESIGNATION । ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరిన అతిశి
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
KEJRIWAL RESIGNATION । ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్.. తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్ రాజీనామాను సక్సేనా ఆమోదించారు. సాయంత్రం తన పార్టీ సహచరులతో కలిసి రాజ్‌భవన్‌కు ఆయన వచ్చారు. కేజ్రీవాల్ వారసురాలిగా ఆప్ ఎన్నుకున్న అతిశి మర్లెన్‌సింగ్ సైతం వారిలో ఉన్నారు. ఇదే సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అతిశి అవకాశం కోరారని ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరినట్టు అతిశి చెప్పారు. ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను కాపాడుతానని అన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడమే కాకుండా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో చిలుకలని తీవ్ర వ్యాఖ్యలు చేసిందని అతిశి గుర్తు చేశారు. వేరే ఎవరైనా ముఖ్యమంత్రి పదవిని అట్టిపెట్టుకునేవారని, కానీ ప్రజా న్యాయస్థానంలో తీర్పు కోరడం కోసమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన అనంతరం మాట్లాడిన అతిశి.. తన రాజకీయ గురువు అరవింద్ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన వారసురాలిగి తనకు పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. బీజేపీ సృష్టించే అడ్డంకుల నుంచి ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని అన్నారు.
మూడో మహిళా ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి అతిశి మూడో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యంత పిన్నవయస్కురాలైన ముఖ్యమంత్రి కూడా ఆమే. ఒకవైపు సంతోషంతో పాటు మరోవైపు జనాదరణ పొందిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామాతో తీవ్ర విచారంగా ఉన్నదని అతిశి అన్నారు. కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను కృషి చేస్తానని అతిశి చెప్పారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వడం ఆప్‌లోనే అందులోనూ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోనే సాధ్యమైందని అతిశి అన్నారు. తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, ఇదే వేరే పార్టీ అయి ఉంటే కనీసం పోటీచేసేందుకు టికెట్ కూడా లభించేది కాదని అన్నారు. తనను కేజ్రీవాల్ విశ్వసించారని, అందుకే ఎమ్మెల్యేను చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై కుట్రలతో బీజేపీ వేధించిందని అతిశి విమర్శించారు. తప్పుడు కుఏసులతో ఆర్నెల్లు జైల్లో ఉంచారని ఆరోపించారు. మళ్లీ ప్రజా తీర్పు పొందే వరకూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనబోనని చెప్పిన కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపించిన అతిశి.. మరే పార్టీలోనూ ఎవ్వరూ ఇలాంటి పని చేయలేరని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యంలో ఇంతటి త్యాగం ఎవరూ చేయలేదని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram