మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !

కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ గిరిజనులు వినూత్న నిరసనలు చేపట్టారు. న్యాయం చేయండి.. లేదంటే మరణం ప్రసాదించండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోని తొలి నదుల అనుసంధాన కార్యక్రమానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్, పన్నా గిరిజనులు తమ ఆందోళన ఉదృతం చేశారు. రూ.44,605 కోట్ల వ్యయంతో కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్ట్ చేపడుతున్నారు. తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ వల్ల తమ ఉనికి కోల్పోతున్నట్లు ఈ ప్రాంతా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ పరిహారం, పునరావాస ప్యాకేజీలను నిరసిస్తూ వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకోవడంతో పాటు చితిపై పడుకుని, బరన్ నదిలో నడుము లోతు నీటిలో నిల్చొని, శిలువలు వేసుకుని నిరసనలు చేపట్టారు.

నదుల అనుసంధాన ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి అంటూ వారు ఈ వినూత్న నిరసనలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు జై కిసాన్ ఆర్గనైజేషన్ నాయకుడు అమిత్ భట్నాగర్ నేతృత్వంలో ఈ ప్రాంత గిరిజనులు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. గిరిజనుల ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతు తెలిపాయి.

ఈ కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్టుతో తమ భూమిని, ఇళ్లను, అడవులను, సంస్కృతిని, గుర్తింపును కోల్పోతున్నామంటూ స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తాము కేవలం భూమి కోసం మాత్రమే కాకుండా, తరతరాలుగా ఇక్కడి భూమిపై తమ మూలాలను నిలుపుకునే హక్కు కోసం తాము పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, తమ నిరసన గొంతులు పాలకులకు వినిపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, ఆందోళన చేస్తున్న తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పలు కుటుంబాలను అధికారిక పునరావాస జాబితాల నుంచి మినహాయించినట్లు ఆరోపిస్తున్నారు.అయితే గిరిజనుల ఆరోపణలను, ఆందోళనలను అధికారులు ఖండిస్తున్నారు. వారితో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు, వారి డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

Latest News