కేరళ దూరదర్శన్‌లో కేరళ స్టోరీ సినిమా ప్రసారం.. తీవ్రంగా నిరసించిన సీపీఎం, కాంగ్రెస్‌

బీజేపీ జట్టులో ఇప్పటికే ఉన్న సీబీఐ, ఐటీ, ఈడీలతోపాటు.. డీడీ కూడా రంగంలోకి దిగినట్టుంది. కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు

కేరళ దూరదర్శన్‌లో కేరళ స్టోరీ సినిమా ప్రసారం.. తీవ్రంగా నిరసించిన సీపీఎం, కాంగ్రెస్‌

పట్టించుకోని డీడీ, ఎన్నికల సంఘం

తిరువనంతపురం: బీజేపీ జట్టులో ఇప్పటికే ఉన్న సీబీఐ, ఐటీ, ఈడీలతోపాటు.. డీడీ కూడా రంగంలోకి దిగినట్టుంది. కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. దూరదర్శన్‌ శుక్రవారం రాత్రి వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీని ప్రసారం చేసింది. దీనికి ప్రతిగా సీపీఎం అనుబంధ యువజన విభాగం డీవైఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేరళ స్టోరీ నిజమా? కట్టుకథా? అనే వీడియోను ప్రదర్శించింది. ఈ వీడియోను ప్రముఖ యూట్యూబర్‌ ధృవ్‌ రాఠీ రూపొందించారు. సినిమా ప్రసారాన్ని వ్యతిరేకిస్తూ తిరువనంతపురంలోని దూరదర్శన్‌ కార్యాలయం ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. వివాదాస్పద సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన దూరదర్శన్‌పై అంతకు ముందు శుక్రవారం ఉదయం కేరళ సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా సమాజాన్ని మత ప్రాతిపదికన చీల్చగలదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, ఈ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయించాలని కోరారు. కానీ.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. అభ్యంతరాలను పక్కనపెట్టిన దూరదర్శన్‌ ఆ సినిమాను ప్రసారం చేసింది. కేరళలో ఎట్టిపరిస్థితుల్లో అడుగు పెట్టాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే కేరళలో వేల సంఖ్యలో యువతులను మతం మార్పించి, ఇస్లామిక ఉగ్రవాదుల్లో చేర్చుతున్నారని పేర్కొంటూ ఎలాంటి ఆధారాలు లేని ఒక సినిమాను బీజేపీ అనుకూల శక్తులు రూపొందించాయి. దీనిపై మొదట్లోనే వివాదం చోటు చేసుకున్నది. ఎన్నికల వేళ బీజేపీకి ప్రయోజనం కల్పించేందుకే ఈ సినిమాను తాజాగా కేరళలో ప్రసారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ఇటువంటి సినిమా ప్రసారంతో రెండు మతాల మధ్య వైషమ్యాలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా దూరదర్శన్‌ నిర్ణయాన్ని ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఈ సినిమాను ప్రసారం చేయవద్దని దూరదర్శన్‌ను కోరారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రచార యంత్రంగా మారొద్దని అన్నారు.