Lal Krishna Advani । హాస్పిటల్‌లో బీజేపీ కురువృద్ధ నేత అద్వానీ..

బీజేపీ కురువృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హాస్పిటల్‌ వర్గాలు ధృవీకరించాయి.

Lal Krishna Advani । హాస్పిటల్‌లో బీజేపీ కురువృద్ధ నేత అద్వానీ..

Lal Krishna Advani । బీజేపీ కురువృద్ధ నేత లాల్‌ కృష్ణ అద్వానీని శనివారం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హాస్పిటల్‌ వర్గాలు పేర్కొన్నాయి. అద్వానీ (96) ఆరోగ్యాన్ని న్యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వినీత్‌ సూరి పర్యవేక్షిస్తున్నారని వార్తా సంస్థలు తెలిపాయి. మాజీ ఉప ప్రధాని అయిన అద్వానీని రెండు రోజుల క్రితం హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఇదే విభాగంలో ఈ ఏడాది మొదట్లో కూడా ఆయన చేరారు. అయితే తాజాగా ఏ సమస్యతో ఆయనను హాస్పిటల్‌లో చేర్చారనే విషయం తెలియరాలేదు.

అవిభక్త భారతదేశంలో కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్‌) నగరంలో 1927, నవంబర్‌ 8న అద్వానీ జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS)లో చేరారు. 1947లోలో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన సంఘ్‌లో అద్వానీ 1951లో చేరారు. 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అద్వానీ, ఆయన సహచరుడు దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి అరెస్టయ్యారు.

1977లో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన సమయంలో అద్వానీ సమాచార, ప్రసార శాఖల మంత్రిగా నియమితులయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 1984లో రెండు సీట్లతో ఉన్న బీజేపీని 1990 నాటికి దేశంలో కీలక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దడంలో అద్వానీ ప్రముఖ పాత్ర పోషించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చేపట్టి ఉద్యమంతో బీజేపీ రాజకీయ దశ తిరిగింది. ఆయన మూడు పర్యాయాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల్లో ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పని చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ.. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేక పోయింది.

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్వానీని పక్కన పెట్టేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అద్వానీ వేదికపై ఉండి నమస్కారం చేస్తున్నా మోదీ పట్టించుకోకుండా పోయిన వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయింది. వాస్తవానికి మోదీ రాజకీయ ఎదుగుదలకు అద్వానీయే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. గుజరాత్‌ అల్లర్ల సమయంలో మోదీకి అద్వానీ మద్దతుగా నిలిచి, ఆయన ముఖ్యమంత్రి పదవి పోకుండా చూశారని అరుణ్‌ జైట్లీ వంటివారు పేర్కొన్నారు. మోదీని తప్పిస్తే పార్టీ క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన వాదించారని జైట్లీ రాశారు.