Landslides | గంగోత్రి మార్గంలో విరిగిపడిన కొండ చరియలు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగోత్రి మార్గంలోని జాతీయ రహదారిపై దబ్రానీ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

విధాత : ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగోత్రి మార్గంలోని జాతీయ రహదారిపై దబ్రానీ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. భారీ బండరాళ్లు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గంగోత్రి జాతీయ రహదారిపై దబ్రానీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం భారీగా బండరాళ్లు కొండపై నుంచి జారి రోడ్డుపై పడ్డాయి . ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలపై రాళ్లు పడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఐదుగురు గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో ఓ బొలెరో వాహనం, బైక్, మారుతీ 800 వాహనం, ట్రక్, జేసీబీ, వాటర్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, 108 అంబులెన్స్, రెవెన్యూ బృందం, డిజాస్టర్ క్యూఆర్‌టీ బృందాన్ని ఘటనా స్థలానికి తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో రాళ్లు పడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా రహదారిని మూసివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.