LoK Sabha polls | ఆ ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు.. 20 మంది ఎమ్మెల్యేలు కూడా..!

LoK Sabha polls | సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్‌ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో స్వల్ప ఘర్షణలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాలకు చెందిన ఒక్కరు కూడా ఓటెయ్యలేదు. జీరో ఓటింగ్ నమోదైంది.

LoK Sabha polls | ఆ ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు.. 20 మంది ఎమ్మెల్యేలు కూడా..!

LoK Sabha polls : సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్‌ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో స్వల్ప ఘర్షణలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాలకు చెందిన ఒక్కరు కూడా ఓటెయ్యలేదు. జీరో ఓటింగ్ నమోదైంది.

ఆ ఆరు జిల్లాల పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలు, నాలుగు లక్షల మంది ఓటర్లు ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దాంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు. నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓట్లు ఉండగా.. ఈ ఆరు జిల్లాల్లోనే 4,00,632 మంది ఓటర్లున్నారు.

ఈ ఆరు జిల్లాల్లోని 20 శాసనసభ స్థానాల పరిధిలో 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌కు సమయం ఇచ్చారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

ఎందుకంటే..

ఈ ఆరు జిల్లాల్లోని నాగా తెగ ప్రజలు 2010 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO) గా ఏర్పడి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ వినిపిస్తున్నారు. అయినా వారి డిమాండ్‌ను పాలకులు పెడచెవిన పెడుతుండటంతో ఈఎన్‌పీవో.. ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో పోలింగ్‌ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే అక్కడి ప్రజలు శాంతియుతంగా ఎన్నికలను బహిష్కరించారే తప్ప ఎలాంటి ఘర్షణ వాతావరణం కనిపించలేదు.

కాగా, తాజా పరిణామంపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫియూ రియో స్పందించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT) కి స్వయంప్రతిపత్తి కల్పించాలని ఇప్పటికే సిఫార్సు చేశామని చెప్పాఆరు. అయితే ఓటే వేయని 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాము ఘర్షణ కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే ఎన్నికల వేళ బంద్‌కు పిలుపునివ్వడాన్ని నాగాలాండ్‌ ఎన్నికల అధికారులు తప్పుపట్టారు. దీనిపై ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి (CEO) వయసన్‌ ఆర్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నోటీసులపై ఈఎన్‌పీవో అధ్యక్షుడు సపికియు సంగ్తం స్పందిస్తూ.. తమకిచ్చిన నోటీసులలో ఈసీ పేర్కొన్న సెక్షన్‌ ఈ సందర్భంలో వర్తించదని చెప్పారు.