Project Cheetah | ప్రాజెక్టు చీతాపై ఆర్టీఐకి సమాచారం నిరాకరణ

దేశంలో అంతరించినపోయిన చీతాల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టు చీతా వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది

Project Cheetah | ప్రాజెక్టు చీతాపై ఆర్టీఐకి సమాచారం నిరాకరణ

జాతీయ భద్రతా.. విదేశీ సంబంధాల సాకు

విధాత: దేశంలో అంతరించినపోయిన చీతాల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టు చీతా వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. నమిబీయా, దక్షిణాఫ్రికాల నుంచి చీతాల నుంచి దఫాలుగా దిగుమతి చేసుకుంటూ మధ్యప్రదేశ్ కూనో పార్కులో ప్రాజెక్టు చీతాను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి పురోగతి తెలుసుకునేందుకు వన్యప్రాణి కార్యకర్త అజయ్ దూబే ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారా దరఖాస్తును మధ్యప్రదేశ్ అటవీ శాఖ తిరస్కరించింది. సెక్షన్ 8(1)(ఎ) కింద జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ చీతాల నిర్వహణపై సమాచారాన్ని నిరాకరించారు.

ప్రాజెక్టు చీతా సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల సార్వభౌమాధికారం, భారతదేశ సమగ్రత, భద్రత, వ్యూహాత్మక, శాస్త్రీయ లేదా ఆర్థిక రాష్ట్ర ప్రయోజనాలు, విదేశాలతో సంబంధాలపై ప్రభావం పడుతుందన్న కారణాలతో సమాచారాన్ని నిరాకరించినట్లుగా మధ్యప్రదేశ్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) కార్యాలయంలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సౌరవ్ కుమార్ కబ్రా స్పష్టం చేశారు. కాగా దూబేకు గతంలో ప్రాజెక్టు చీతా సమాచారాన్ని ఆర్టీఐ కింద అందించిన అటవీశాఖ ఈ దఫా తిరస్కరించడం గమనార్హం. తాను 2013నుంచి పులులకు సంరక్షణ ప్రాజెక్టులలోని అక్రమాలను వెల్లడిస్తున్నాని, తొలిసారిగా తనకు ఆర్టీఐ సమాచారాన్ని నిరాకరించడం జరిగిందని దూబే పేర్కోన్నారు.

ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి దిగుమతి చేసుకున్న 8చీతాలను 2022 సెప్టెంబర్ 17న కూనో నేషనల్ పార్కులో ప్రధాని మోదీ చేతుల మీదుగా వదిలారు. ప్రస్తుతం పిల్లలతో సహా చీతాల సంఖ్య 26 చేరింది. మొదటి బ్యాచ్ నమీబియా చీతాల ఆరోగ్యం గురించి అడిగిన సమాచారంలో భారత భూభాగంలో పుట్టిన చీతా పిల్ల కుడి కాలు ఫ్రాక్చర్ అయినట్లు గత నవంబరు 28న దూబే వెల్లడించారు. రెండవ బ్యాచ్ 12 చిరుతలను గత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుని నేషనల్ పార్కు అభయారణ్యంలోని నిర్ధేశిత కంచె ప్రాంతంలోకి వదిలారు.

చాలా గొప్పగా చెప్పుకునే చీతాల సంరక్షణ ప్రాజెక్ట్ ప్రారంభంలో వాటి మరణాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది. దేశంలోని చివరి చీతా 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ జాతి 1952లో భారతదేశం నుండి అంతరించిపోయినట్లు ప్రకటించబడింది. ఏడు దశాబ్దాల తర్వాత చీతాలను ప్రాజెక్టు చీతా ద్వారా మళ్లీ దేశంలో అభివృద్ధి చేస్తున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి ఏడాదికి 12నంచి14చీతాలను దిగుమతి చేసుకోనున్నారు.

26కు చేరిన చిరుతలు

అయితే ఈ ఏడాది 12 పిల్లలు పుట్టడంతో ప్రాజెక్టు సరైన దారిలో పడుతోందని అధికారులు చెబుతున్నారు. నమీబియా చీతా ఆషా జనవరిలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నమీబియాకు చెందిన జ్వాల అనే మరో ఆడ చీతా కూడా అదే నెలలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అదే చీతా గత సంవత్సరం నాలుగు పిల్లలను ప్రసవించింది. అయితే వాటిలో ఒకటి మాత్రమే బతికి ఎదుగుతుంది. మార్చిలో దక్షిణాఫ్రికా చిరుత గామిని ఆరు పిల్లలకు జన్మ నివ్వడంతో, కునో పార్కులో చీతా పిల్లలతో సహా మొత్తం చిరుతల సంఖ్య ఇప్పుడు 26కు చేరుకుంది. గత మార్చి నుండి, శౌర్యతో సహా ఏడు పెద్ద చిరుతలు వివిధ కారణాల వల్ల మరణించాయి.

ఏడు వయోజన చిరుతలు మూడు ఆడ, నాలుగు మగ చీతాలు మరణించగా, వాటిలో సాషా, ఉదయ్, దక్ష, తేజస్, సూరజ్, ధాత్రి, శౌర్య ఉన్నాయి. మార్చి నుంచి ఆగస్టు 2023 మధ్య ఆరు నెలల వ్యవధిలో మొదటి ఆరు మరణాలు సంభవిందాయి.ప్రభుత్వం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలోని కంచె ప్రాంతంలోకి చిరుతలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది, బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి, సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని సమాచారం. గుజరాత్‌లోని బన్ని గడ్డి భూముల్లో చిరుత సంరక్షణ పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఫిబ్రవరిలో సెంట్రల్ జూ అథారిటీ ఆమోదం తెలిపింది.