మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహాయుతి స్వీప్‌.. 9 సీట్లలో విజయం.. 2 సీట్లలో అఘాడీ

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 9 సీట్లను కైవసం చేసుకున్నది. శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ, మిత్రపక్షాలకు ఈ ఫలితాలు కాస్తంత ఊరటనిచ్చాయి.

 మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహాయుతి స్వీప్‌.. 9 సీట్లలో విజయం.. 2 సీట్లలో అఘాడీ

ముంబై: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 9 సీట్లను కైవసం చేసుకున్నది. శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ, మిత్రపక్షాలకు ఈ ఫలితాలు కాస్తంత ఊరటనిచ్చాయి. మహాయుతి కూటమిలో బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. బీజేపీ తరఫున దివంగత సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండే కుమార్తె పంకజ ముండే సహా ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. షిండే, అజిత్‌ పార్టీల నుంచి ఇద్దరేసి అభ్యర్థులు గెలుపొందారు.
ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ తరఫున కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్‌) పార్టీలు ముగ్గురు అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ తరఫున ప్రద్న్య సతావ్‌, శివసేన (యూబీటీ) నుంచి మిలింద్‌ నర్వేకర్‌ విజయం సాధించారు. మొత్తం 11 సీట్లకు ఎన్నికలు నిర్వహించగా.. రెండు కూటముల నుంచి 12 మంది బరిలో నిలిచారు. జూలై 27తో పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్సీల స్థానంలో వీరిని ఎన్నుకున్నారు.
ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అజిత్‌పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వారికి నా ధన్యవాదాలు. ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. కానీ వాటి గురించి నేను ఆలోచించను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహాయుతి ఇటువంటి విజయాలనే సాధిస్తుంది’ లని చెప్పారు.


విజేతలు వీరే
బీజేపీ : పంకజ ముండే, యోగేశ్‌ తిలేకర్‌, పరిణయ్‌ ఫుకే, అమిత్‌ గోర్ఖే, సదాభావు ఖో.
శివసేన : కృపాల్‌ తుమానే, భావనా గావ్లీ.
ఎన్సీపీ : రాజేశ్‌ విటేకర్‌, శివాజీరావు గార్జే.
శివసేన (యూబీటీ) మిలిండ్‌ నర్వేకర్‌.
కాంగ్రెస్‌ : ప్రద్న్య సతావ్‌.
వాస్తవానికి మూడు అభ్యర్థిని గెలిపించుకునేందుకు తగిన సంఖ్యాబలం మహావికాస్‌ అఘాడీకి లేదు. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కావాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
బీజేపీకి 103, శివసేనకు 38, ఎన్సీపీ 42, కాంగ్రెస్‌ 37, శివసేన (యూబీటీ) 15, ఎన్సీపీ (శరద్‌) 10 ఓట్లు లభించాయి.