Maoist Party| విప్లవోద్యమంపై తగ్గేదే లేదు: మావోయిస్టు పార్టీ

విప్లవ ప్రతిఘాతక ‘ఆపరేషన్ కగార్’ ను ఎదుర్కొంటూ పార్టీ, పీఎల్జీఏ, ప్రజా సంఘాలు, విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలని, సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల కూటమికి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది.

Maoist Party| విప్లవోద్యమంపై తగ్గేదే లేదు: మావోయిస్టు పార్టీ

విధాత : విప్లవ ప్రతిఘాతక ‘ఆపరేషన్ కగార్’ ను ఎదుర్కొంటూ పార్టీ, పీఎల్జీఏ, ప్రజా సంఘాలు, విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలని, సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల కూటమికి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టు పార్టీ(Maoist Party) సెంట్రల్ మిలిటరీ కమిషన్(Central Military Commission) పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీకి చెందిన ప్రజా విముక్త గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోవాలని పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) పిలుపునిచ్చింది. తాజాగా సీఎంసీ పేరుతో విడుదలైన 16 పేజీల సందేశాన్ని విడుదల చేసింది.

‘ఆపరేషన్ కగార్‌’‌తో పార్టీకి తీవ్ర నష్టాలు జరుగుతున్నప్పటికీ విప్లవోద్యమం ఇంకా జీవించి ఉందని, అదే స్ఫూర్తిని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, పీఎల్జీఏ యోధులకు, ప్రజా సంఘాలకు, పీడిత ప్రజలకు 25వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది.

11నెలల్లో అమరులైన 320 మంది మావోయిస్టులు

2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు అంటే 11 నెలల కాలంలో దేశ వ్యాప్తంగా 320 మంది మావోయిస్టు కామ్రేడ్లు అమరులయ్యారని సీఎంసీ లేఖలో పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు, 8 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ స్థాయి నేతలు ఉన్నారని వెల్లడించింది. కేవలం ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 243 మంది అమరులు అయ్యారని తెలిపింది. ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీతో పాటు విప్లవోద్యమానికి తీవ్ర నష్టమని సీఎంసీ పేర్కొంది. ఇదే సమయంలో ‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా పీఎల్జీఏ ఆత్మరక్షణ గెరిల్లా ప్రతిదాడుల్లో 116 మంది పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది మరణించారని తెలిపింది. మరో 208 మంది గాయపడ్డారని పేర్కొంది. ఐఈడీ దాడులు, ఆంబుష్‌లు, పోలీసు ఇన్ ఫార్మర్ల నిర్మూలన, బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని తెలిపింది.

నాయకత్వం..కేడర్ రక్షణతో పాటు పార్టీ విస్తరణ

ప్రజా విముక్త గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) 25వ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ నాయకత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో మొదట నాయకత్వ, బలగాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా సీఎంసీ పేర్కొంది. అదేవిధంగా గెరిల్లా యుద్ధ నియమాలను కచ్చితంగా అమలు చేయడం, కేంద్రీకృత బలగాలను వికేంద్రీకృతం చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ, సైనిక, సామూహిక కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లుగా పేర్కొంది.