Markandey Katju | ప్రజాపోరాటాలు, విప్లవంతోనే సమస్యల పరిష్కారం
జూన్ 4న ఎన్నికల ఫలితాల అనంతరం బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అన్నారు

మోదీ అయినా, రాహుల్ అయినా తేడా లేదు
జూన 4 తర్వాత ఏర్పడేది బలహీన సంకీర్ణం
సుదీర్ఘకాలం అస్థిర పరిస్థితులు కొనసాగుతాయి
దేశ ప్రగతిని నాశనం చేసిన కుల, మతతత్వాలు
వాటికి అతీతంగా బలమైన ప్రజాపోరాటాలు రావాలి
వాటి ద్వారానే బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడుతుంది
అప్పుడే ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారాలు
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు
న్యూఢిల్లీ: జూన్ 4న ఎన్నికల ఫలితాల అనంతరం బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అన్నారు. ఆ సంకీర్ణానికి నరేంద్రమోదీ లేదా రాహుల్‌గాంధీ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. సదరు ప్రభుత్వం మొఘల్ కాలం తర్వాతి పరిస్థితులను జ్ఞప్తికి తెస్తుందని, అస్థిరపరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు వీక్ మ్యాగజైన్‌కు ఆయన ఒక వ్యాసం రాశారు.
సంకీర్ణానికి మోదీ నాయకత్వం వహించినా, రాహుల్ నాయకత్వం వహించినా దారిద్ర్యం, నిరుద్యోగిత, ఆకలి పెరిగిపోతుందని, వాటితోపాటే ధరల పెరుగుదల, ఆరోగ్య వ్యవస్థ పతనం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజాపోరాటాలతో ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఈ పరిస్థితి సదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుందని రాశారు. అప్పుడు ఏర్పడే ప్రభుత్వం భారతదేశాన్ని ఆధునీకరిస్తుందని, ప్రజలకు జీవితాలను ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.
‘వాస్తవంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లేమి (దేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పోషకాహార లేమితో బాధపడుతున్నారని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేర్కొంటున్నది), ఆకాశాన్ని అంటుతున్న ఆహార, ఇంధన, ఔషధాల ధరలు, దాదాపు తగిన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం, పేదలకు మంచి విద్య అందకపోవడం’ అని కట్జు తన వ్యాసంలో పేర్కొన్నారు. కుల, మత ఓటు బ్యాంకు ప్రాతిపదికన ఎక్కువగా ఆధారపడే ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సమస్యలు పరిష్కారం కాబోవని ఆయన తెలిపారు.
కులతత్వం, మతతత్వం అనేవి భూస్వామ్య శక్తులన్న కట్జు.. దేశ ప్రగతిని అవే నాశనం చేశాయని, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని మరింత పాతుకుపోయేలా చేసిందని పేర్కొన్నారు. అందుకే దీని స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ రావాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు ప్రస్తుత వ్యవస్థకు వెలుపలి వ్యవస్థలో ఉన్నాయని కట్జు అభిప్రాయపడ్డారు.
ఆ వ్యవస్థ రావాలంటే కుల, మత భావనలకు అతీతంగా శక్తిమంతమైన ప్రజాపోరాటాలు, విప్లవాలు అవసరమని పేర్కొన్నారు. ఆ ప్రజాపోరాటాలకు ఆధునిక భావాలున్న, నిస్వార్థ, దేశభక్తియుత నాయకుల నాయకత్వం అవసరమని చెప్పారు. ఆ నాయకత్వంలోనే అమెరికా లేదా చైనా వంటి పారిశ్రామిక దిగ్గజంగా రూపాంతరం చెందేందుకు రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
అప్పుడే నిజమైన సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. శీఘ్రగతిన పారిశ్రామీకరణతోనే ప్రజల సంక్షేమానికి అవసరమైన సంపదను ఉత్పత్తి చేసుకోగలమని పేర్కొన్నారు. భారతదేశ అసలు సమస్య ఉత్పత్తిని ఎలా పెంచడం అనేది కాదని ఆయన అన్నారు. ఇప్పుడున్న అపార సాంకేతిక పరిజ్ఞానంతో, ఇతోధికంగా ఉన్న ప్రకృతి వనరులతో దానిని పెంచుకోవచ్చిని అయితే.. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ఎలాగన్నదే సమస్యని కట్జు పేర్కొన్నారు.
అయితే.. చారిత్రక అనుభవాలు గమనిస్తే గతంలో అనేక విప్లవాలు సుదీర్ఘ సైద్ధాంతిక విప్లవాల అనంతరమే విజయవంతమయ్యాయని తెలిపారు. అందుకు ఈ విప్లవం తుపాకులు, బాంబుల్లా తన ఆలోచనలను ఉపయోగిస్తుందన్నారు. అసలైన విప్లవానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా విప్లవాలను ఉదహరించారు. ఈ విప్లవాలన్నీ సిద్ధాంత పోరాటాల అనంతరం వచ్చినవేనని తెలిపారు.
భారతదేశ ప్రస్తుతం సైద్ధాంతిక విప్లవ కాలం మీదుగా నడుస్తున్నదని, కానీ.. వాస్తవ విప్లవం చాలా దూరం ఉన్నదని మార్కండేయ కట్జు విశ్లేషించారు. ఈ కాలంలో దేశభక్తియుత జ్ఞానం కలిగినవారు భూస్వామ్య ఆలోచనా విధానంపై, కులతత్వం, మతతత్వం, మూఢనమ్మకాలు వంటి సంప్రదాయాలు, విధానాలపై తప్పనిసరిగా శక్తిమంతమైన, తిరుగులేని దాడి చేయాలన్నారు.
వందల కోట్ల జనాభా ఉన్న భారతదేశ ఆలోచనా విధానాన్ని మార్చడం భారీ, అత్యంత క్లిష్టమైన పనే అయినప్పటికీ.. శతాబ్దాల భూస్వామ్య ఆలోచనా విధానంపై వాస్తవ విప్లవాన్ని లేవదీయగలదని పేర్కొన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికాల్లో విప్లవాలు భావ ప్రకటనా స్వేచ్ఛ, స్వేచ్ఛ, తదితర రాజకీయ హక్కుల కోసం ప్రధానంగా ఉద్దశించినవని, కానీ.. భారతదేశంలో జరిగే విప్లవాలు మాత్రం ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులైన ఉద్యోగం, మంచి ఆదాయం, ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యవసర వస్తువులు తక్కువ ధరలకే లభించడం, ఉచిత వైద్యం, మంచి విద్య అందరికీ అందించడం కోసం కేంద్రీకరించాలని సూచించారు.