Prime Minister Narendra Modi । దేశానికి లౌకిక సివిల్‌ కోడ్‌ కావాలి: ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ

దీర్ఘకాలంగా బీజేపీ ఎజెండాలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారు.

  • By: Subbu |    national |    Published on : Aug 15, 2024 3:59 PM IST
Prime Minister Narendra Modi । దేశానికి లౌకిక సివిల్‌ కోడ్‌ కావాలి: ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi । దీర్ఘకాలంగా బీజేపీ ఎజెండాలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారు. గురువారం (ఆగస్ట్‌ 15, 2024) దేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని.. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి పౌరస్మృతికి ‘లౌకిక’ అనే పదాన్ని జోడిస్తూ దేశానికి సెక్యులర్‌ సివిల్‌ కోడ్‌ (secular civil code) అవసరమని చెప్పారు. దేశం 75 సంవత్సరాలుగా వివక్షాపూరిత కమ్యునల్‌ సివిల్‌ కోడ్‌ కింద మగ్గిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపి, దేశంలోని సింహభాగం ప్రజలు ప్రస్తుత సివిల్‌ కోడ్‌ వివక్షాపూరితమైనదని భావిస్తున్నందున దీనిపై ఆదేశాలు జారీ చేసిందని మోదీ చెప్పారు. ‘దానిని నెరవేర్చడం మన కర్తవ్యం’ అని ప్రధాని అన్నారు.

‘సుప్రీంకోర్టు (Supreme court) సివిల్‌ కోడ్‌ అంశాన్ని అనేక సందర్భాల్లో చర్చించింది. ఇప్పుడు ఉన్న సివిల్‌ కోడ్‌ వివక్షను చూపే కమ్యునల్‌ సివిల్‌ కోడ్‌ (communal civil code). ఈ అంశంపై దేశంలో విస్తృత చర్చ జరగాలని నేను నమ్ముతున్నాను. మత ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నటువంటి చట్టాలకు ఆధునిక సమాజంలో ఎలాంటి స్థానం లేదు’ అని మోదీ చెప్పారు. ‘కమ్యునల్‌ సివిల్‌ కోడ్‌ కింద మనం 75 ఏళ్లు గడిపాం. ఇప్పుడు సెక్యులర్‌ సివిల్‌ కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం మత ప్రాతిపదికన కొనసాగుతున్న వివక్ష (discrimination) నుంచి, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న వ్యత్యాసాల నుంచి విముక్తి కాగలం’ అని ప్రధాని చెప్పారు.

అనేక సంవత్సరాలుగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రస్తావిస్తున్నది. మహిళలకు ఆస్తి హక్కు, దత్తత హక్కు, మహిళలకు సైతం సమాన సంరక్షణ హక్కులు ఇచ్చేందుకు, విడాకుల చట్టంలో వివక్షను తొలగించేందుకు, బహుభార్యాత్వానికి ముగింపు పలికేందుకు, వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసేందుకు అన్ని సంప్రదాయాల్లోని ప్రగతిశీల సంప్రదాయాల ఆధారంగా ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించే బాధ్యతను లా కమిషన్‌ తీసుకోవాలని 1998 మ్యానిఫెస్టోలో బీజేపీ పేర్కొన్నది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 21వ లా కమిషన్‌ (21st Law Commission).. ఈ దశలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమైనదీ కాదు.. వాంఛనీయమూ కాదని పేర్కొన్నది. అందుకే ఉమ్మడి పౌరస్మృతికి బదులు వివక్షాపూరిత చట్టాలపై (discriminatory) తాము దృష్టిసారించామని తన సంప్రదింపుల పత్రంలో తెలిపింది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.