Bihar Assembly Elections | బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..

Bihar Assembly Elections | తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహుదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ గత ఐదారేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు, లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. ఎంఐఎం పోటీ మూలంగా సెక్యూలర్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలవుతుండగా, ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

  • By: raj |    national |    Published on : Nov 16, 2025 7:30 AM IST
Bihar Assembly Elections | బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..

25 సీట్లలో పోటీ చేయగా 5 గెలుపు
16 మంది ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి సాయం

Bihar Assembly Elections |  హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహుదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ గత ఐదారేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు, లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. ఎంఐఎం పోటీ మూలంగా సెక్యూలర్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలవుతుండగా, ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ తన అభ్యర్థులను బ‌రిలోకి దింపింది. ఇందులో ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించగా, మిగతా పదహారు నియోజకవర్గాల్లో ఎన్డీఏ పార్టీకి చెందిన జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ 2, ఆర్జేడీ, ఆర్ఎల్ఎం ఒక్కో స్థానంలో గెలిచాయి.

అయితే ఆర్జేడీ 12, కాంగ్రెస్ 4 స్థానాలలో ఓటమి పాలైంది. ఎంఐఎం అభ్యర్థుల కారణంగానే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు విజయం సాధించలేక చతికిలపడిపోయాయి. ఈ నియోజకవర్గాలు అన్నీ 40 శాతం వరకు ముస్లిం ఓట్ల ప్రాభల్యం ఉన్న నియోజకవర్గాలు. గెలుపు ఓటములలో ముస్లిం ఓటర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు సంప్రదాయ ఓట్లు ఉన్నప్పటికీ వారందరూ మజ్లిస్ పార్టీకి జై కొట్టడంతో భారీగా నష్టం వాటల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో నష్ట పరిచిన విధంగానే బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలను కోలుకోకుండా చేసిందంటున్నారు.

ఉదాహారణకు గోపాల్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుభాష్ సింగ్‌కు 96,892, కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ గార్గ్ 67,820, ఎంఐఎం అభ్యర్ధి అనాష్ సలామ్‌కు 14,225 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం మూలంగా బీజేపీ అభ్యర్థి 28,972 ఓట్లతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అదే విధంగా బలరాంపూర్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మొహ్మద్ అదిల్ హసన్ పోటీ చేసి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి మహబూబ్ అలం ఓటమికి కారణమయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఎన్డీఏ నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి సంగీతా దేవీ బరిలో ఉన్నారు. ఆమె ఎంఐఎం అభ్యర్థి అదిల్ హసన్‌పై 389 ఓట్లతో గెలుపొందారు. సంగీతా దేవీకి 80,459 ఓట్లు రాగా, అదిల్ హసన్‌కు 80,070 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 11 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేసి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి మహబూబ్ అలంను ఓటమి పాలయ్యేలా చేశారు. సంగీతకు 80,459, అదిల్ హసన్‌కు 80,070, మహబూబ్ అలంకు 79,141 ఓట్లు వచ్చాయి. లోక్ జనశక్తి అభ్యర్థి విజయం సాధించడంలో ఎంఐఎం పార్టీకి చెందిన‌ 11 మంది ముస్లిం అభ్యర్థుల పాత్ర ఉంది.