Prime Minister Narendra Modi । ఒకే దేశం.. ఒకే ఎన్నిక : ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ
ఒకే దేశం.. ఒకే ఎన్నిక (one nation one election) అంశాన్ని సైతం ప్రధాని మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని కూడా బీజేపీ తరచూ లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే ఆలోచనకు మద్దతు ఇవ్వాలని ఈ ఎర్రకోట (Red Fort) నుంచి రాజకీయ సమాజాన్ని (political community) కోరుతున్నా’ అని మోదీ పిలుపునిచ్చారు

Prime Minister Narendra Modi । ఒకే దేశం.. ఒకే ఎన్నిక (one nation one election) అంశాన్ని సైతం ప్రధాని మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని కూడా బీజేపీ తరచూ లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే ఆలోచనకు మద్దతు ఇవ్వాలని ఈ ఎర్రకోట (Red Fort) నుంచి రాజకీయ సమాజాన్ని (political community) కోరుతున్నా’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు ఇది కీలకమని అన్నారు. తరచు ఎన్నికలు (Frequent elections) జరగడం వల్ల దేశాభివృద్ధిలో స్తబ్దత (stagnation) నెలకొంటున్నదని అన్నారు. ఈ రోజు ప్రతి పథకం, ప్రతి కార్యక్రమం ఎన్నికలతో ప్రభావితమవుతున్నదని చెప్పారు. ప్రతి చర్య రాజకీయ రంగు పులుముకుంటున్నదని అన్నారు.
బంగ్లాదేశ్‌లో (Bangladesh) పరిణామాల పట్ల పొరుగుదేశంగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నదని మోదీ చెప్పారు. ఆ దేశంలో హిందువులు మైనార్టీలుగా ఉన్నారన్న అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.
‘అక్కడి పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుతుందని ఆశిస్తున్నా. ప్రత్యేకించి మన 140 కోట్ల దేశ ప్రజలు.. అక్కడి హిందువులు (Hindus), మైనార్టీల (minorities) గురించి, వారి రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు. మన పొరుగుదేశాలు (neighbouring countries) శాంతి, సంతోషాలతో (happiness) ముందుకు సాగాలని భారతదేశం ఎల్లప్పుడు కోరుకుంటుంది. శాంతి పట్ల మనం చిత్తశుద్ధితో ఉన్నాం’ అని మోదీ చెప్పారు. బంగ్లాదేశ్‌కు తన సహకారాన్ని భారత్ భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మైనార్టీల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. భారతదేశంలో మైనార్టీలపై (minorities in India), ప్రత్యేకించి ముస్లింలపై దాడుల విషయంలో మాత్రం మౌనం వహించారు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు భారతదేశంలో మైనార్టీల స్థితిగతుల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అవినీతిపై యుద్ధం కొనసాగుతుంది
అవినీతి (corruption) అంశంపైనా ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో మాట్లాడారు. అవినీతిపై పోరాటానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ‘నేను అవినీతిపై యుద్ధం (war against corruption) ప్రకటించాను. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నా ప్రతిష్ఠ (reputation) దెబ్బతింటుందనీ తెలుసు. కానీ.. దేశం కంటే నా ప్రతిష్ఠ పెద్దదేమీ కాదు. అవినీతిపై నా నిజాయతీపూర్వక యుద్ధం కొనసాగుతుంది. అవినీతికి పాల్పడటానికి భయపడే వాతావరణాన్ని సృష్టించాలని అనుకుంటున్నాను’ అని ప్రధాని తెలిపారు. గతంలో అమ్మానాన్నల సంస్కృతి ఉండేదని మోదీ అన్నారు. ప్రజలు తమ ప్రతి అవసరాలకు ప్రభుత్వాన్ని వేడుకోవాల్సి వచ్చేదని తెలిపారు. కానీ.. ఈ రోజు ఆ పరిస్థితి మారిపోయిందని చెప్పారు. ‘కొంతమంది అవినీతిని బాహాటంగానే కీర్తిస్తున్నారు. అవినీతిపరులు ఆమోదయోగ్యమైనవారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మోదీ విమర్శించారు.
కోల్‌కతాలోని మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య నేపథ్యంలో.. మహిళలపై జరుగుతున్న హింస పట్ల ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇటువంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. వారసత్వ కబంధ హస్తాల నుంచి రాజకీయాలను విముక్తి చేసేందుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను ఎన్నికల రాజకీయాల్లోకి (electoral politics) తీసుకొచ్చేందుకు తాను ఆలోచనలు చేస్తున్నానని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డీవై చంద్రచూడ్ తదితరులు సహా ఆరువేల మంది అతిథులు పాల్గొన్నారు. మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ఇది వరుసగా 11వ సారి కావడం విశేషం. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.