MUDA scam | కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం.. సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతి
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ముడా లేఅవుట్ స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యను విచారించనున్నారు
కోర్టులో సవాల్ చేస్తామన్న సిద్ధరామయ్య
రాజ్‌భవన్‌ను రాజకీయ కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ ఫైర్
కర్ణాటక కేబినెట్ అత్యవసర భేటీ
MUDA scam | కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో మైసూరు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ముడా లేఅవుట్ స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah)ను విచారించనున్నారు. ఈ అవినీతి కేసులో సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముడా లేఅవుట్‌లో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఖరీదైన ప్లాట్లను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముడా లేఅవుట్‌లో ఎలా ఆమె ఓనర్ అయ్యారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విచారణ కోసం గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో.. సిద్ధరామయ్యపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ అభ్యర్థనల మేరకు గవర్నర్ విచారణ కోసం ఆదేశాలు ఇచ్చారు.
భారతీయ నాగరికా సురక్షా సంహితలోని సెక్షన్ 17, సెక్షన్ 218 కింద విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలతో సీఎం సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనుండటం ప్రభుత్వానికి సైతం సమస్యగా మారనుంది. ఇటీవలే ముడా వివాదంపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ జూలై నెలలో సీఎం సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై విచారణకు అనుమతించవద్దని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని గవర్నర్ వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇది గవర్నర్ పదవిని దుర్వినియోగం చేయడం కిందికే వస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. కేబినెట్ తీర్మానం పట్టించుకోని గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ విచారణకు అనుమతి ఇచ్చారు.
కేబినెట్ అత్యవసర భేటీ
ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాజభవన్‌ను రాజకీయ కేంద్రంగా మార్చేశారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. గవర్నర్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం సిద్ధరామయ్య కేబినెట్ (Cabinet) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సైతం కర్ణాటక చేరుకున్నారు.
ముడాపై ఎందుకీ వివాదం
ముడా కుంభకోణం (MUDA Sacam)లో సిద్ధూ సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా భూసేకరణలో భాగంగా 50:50పరిహారం ప్రకటించింది. ఎకరం తీసుకుంటే అర ఎకరం అభివృద్ధి చెందిన భూమి ఇస్తారు. లేదంటే ఆర్థిక ప్యాకేజీ ఎంచుకోవచ్చు. ముడా భూసేకరణ పరిహారంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక కార్యకర్తలు, బీజేపీ ఆరోపించింది. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండగా, ఆ భూమిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాదీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది.
కెసరెలోని భూమితో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. దీనిపై గతంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ తనకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని అన్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా.. అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే.. దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram