ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంబై, పూణే నగరాలను అతలాకుతలం చేశాయి. లోనావాలాలో రికార్డు వర్షపాతం నమోదవగా, రైలు, రహదారి రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాయగఢ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మహారాష్ట్రలో మూడు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు పూణే, ముంబై నగారాలను అతలాకుతలం చేస్తున్నాయి. పూణే జిల్లాలోని పర్యాటక ప్రాంతం లోనావాలో 24 గంటల్లో రికార్డుస్థాయిలో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భిరా, తంహిని తదితర ప్రాంతాల్లోనూ 500 మి.మీ. పైగా వాన పడింది. వరద నీటి రాకతో బీమా నది ఉదృతి పెరిగి ఉజ్జయిని డ్యామ్ లోకి పరవళ్లు తొక్కుతుంది. ముంబై సహా తీర ప్రాంతా జిల్లాలలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాయగఢ్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్ర వరదలలో ఇప్పటివరకు 18 మంది దుర్మరణం పాలయ్యారు.

ముంబై వర్షాల కారణంగా వసాయ్–నలాసోపారా మధ్య రైల్వే పట్టాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ఇంటికి చేరుకునేందుకు ప్రయాణికులు మోకాళ్ల లోతు వర్షపు నీటిలో నడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మూడువైపులా నీరుండే ముంబై నగరం నాలుగోవైపు వరదలతో రోడ్లు, రైల్వే ట్రాక్ లు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి ద్వీపంలా మారింది. ముంబయి-పుణె, ముంబయి-అహ్మదాబాద్, ముంబయి-కొంకణ్‌ రహదారులు మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వేలో టన్నెల్‌ వద్ద విరిగిపడిన కొండ చరియలు

ముంబయి, పుణె ఎక్స్‌ప్రెస్‌ వేలో టన్నెల్ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయగా, భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ అంతరాయాలను తొలగించేందుకు ‘మిస్సింగ్‌ లింక్‌’ పేరుతో 13.3 కిలోమీటర్ల బైపాస్‌ను రూ.6,695 కోట్లతో నిర్మించారు. ఇందులో రెండు సొరంగాలు (1.6 కి.మీ., 8.9 కి.మీ.) ఉన్నాయి. 183 మీటర్ల తీగల వంతెన ఉంది. దీనివల్ల దూరం తగ్గేది 6 కిలోమీటర్లే అయినా ప్రయాణ సమయం 20 నుంచి 30 నిమిషాలు తగ్గుతోంది. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రారంభించారు. సొరంగం సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో తాత్కాలికంగా ట్రాఫిక్ నిలిపివేశారు. 18 గంటల పాటు శ్రమించి మార్గాన్ని పునరుద్ధరించారు.

ఇతర రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు..వరదలు

దేశంలో రుతుపవనాల ప్రభావంతో జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, కేరళ, ఒరిస్సా సహా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మ్మూకశ్మీర్‌ డోడా , కిష్త్వార్ జిల్లాల్లో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద, బండరాళ్లు కొట్టుకురావడంతో తాత్రి పట్టణంలో పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తాత్రి పట్టణంలో రోడ్డుపక్కన నిలిపిన అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోగా, కొన్ని చీనాబ్ నదిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా డోడా-కిష్త్వార్ జాతీయ రహదారి తాత్రి వద్ద మూసుకుపోయింది.

కేరళలోని వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండచరియల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. కొండచరియల కారణంగా మలప్పురం – వయనాడ్‌ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Latest News