ముంబై ట్రాఫిక్ వివాదంపై వైరల్ వీడియో: మహిళ వివరణ

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన నిరసన ప్రదర్శనతో నెలకొన్న ట్రాఫిక్ జామ్ పై మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌ను నిలదీస్తూ కనిపించిన టీనా చౌదరి అనే మహిళ తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ మారింది.

ముంబై ట్రాఫిక్ వివాదంపై వైరల్ వీడియో: మహిళ వివరణ

విధాత : మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన నిరసన ప్రదర్శనతో నెలకొన్న ట్రాఫిక్ జామ్ పై మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌ను నిలదీస్తూ కనిపించిన టీనా చౌదరి అనే మహిళ తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ మారింది. ఆనాటి ట్రాఫిక్ జామ్ ఘటన వైరల్ వీడియోలో నల్లటి టోపితో కనిపించిన టీనా చౌదరి తాజా వీడియోలో తాను సురక్షితంగానే ఉన్నానని, నా క్షేమ సమాచారం కోసం అనేక పోస్టులు, సందేశాలు రావడాన్ని నేను చూశానని, నాకు మద్దతునిచ్చిన అందరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

ఆ రోజు గంటన్నర పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన తర్వాతే ట్రాఫిక్ క్లియరేన్స్ కోసం పోలీసుల సహాయం కోరానని తన వీడియోలో చెప్పారు.

నిలిచిపోయిన బస్సులను తొలగించమని తాను పోలీసులను కోరానని, నిరసనకారులపై బాటిల్ విసిరారన్న ఆరోపణను ఆమె ఖండించారు. ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి మంత్రి మహాజన్ జోక్యం చేసుకున్నారని ఆమె తెలిపారు.

యూనిఫామ్ తో ఉంటే ప్రజాసేవలో ఉన్నట్లుగా భావించాలి..

తన తాత, తండ్రి ఇద్దరూ భారత సైన్యంలో పనిచేశారని టీనా చౌదరి అన్నారు. ఆమె తండ్రి భారతదేశం కోసం రెండు యుద్ధాలు చేశారని.. తన కుటుంబంలోని 8 మంది సభ్యులు భారత సైన్యంలో సేవ చేశారని కూడా ఆమె చెప్పారు. నేను ‘సేవ’ అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నానని.. ఎందుకంటే మీరు యూనిఫాం ధరించినప్పుడు, మీరు ప్రజా సేవలో ఉన్నట్లే లెక్క. అది మీకు ఎవరినైనా నిర్లక్ష్యం చేసేందుకో, అగౌరవపరిచేందుకో, లేదా భయపెట్టేందుకో లైసెన్స్ ఇవ్వదు అని చెప్పుకొచ్చారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఆ రోజు, అంటే ఏప్రిల్ 21న, సాయంత్రం 4 గంటలకు నేను నా కుమార్తెను ఆమె సంగీత తరగతి వద్ద దింపి వచ్చాను. సాయంత్రం 4:45 గంటలకు ఆమెను తిరిగి తీసుకురావాల్సి ఉంది. నేను ‘మహీంద్రా తాజ్’ వద్ద ఎడమ మలుపు తిరిగినప్పుడు, మేము అక్కడ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాం. నేను దాదాపు 25 నిమిషాల పాటు నా కారులోనే ఉండిపోయాను. ట్రాఫిక్ అస్సలు కదలకపోవడంతో, అసలు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి నేను కారు దిగాను. ఆ తర్వాత గంటన్నర పాటు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క పోలీసు అధికారి వద్దకు వెళ్లి నేను ఒక విన్నపం చేశాను. ‘మీరు దారికి అడ్డుగా ఉన్న ఆ రెండు బస్సులను అక్కడి నుండి తొలగిస్తే, ఇక్కడ చిక్కుకుపోయిన ప్రజలందరూ ‘U-turn’ తీసుకుని ప్రధాన రహదారిని చేరుకోగలరు’ అని వారిని కోరాను. కానీ నాకు వారి నుండి ఎటువంటి స్పందన గానీ, సమాధానం గానీ లభించలేదని తెలిపారు.

ఆ సీసాను పోలీసులపై విసరలేదు..

నేను ఆ సీసాను ఏ నిరసనకారుడి వైపు గానీ, ర్యాలీ వైపు గానీ విసరలేదు అని..పోలీసుల దృష్టిని ఆకర్షించడానికి కేవలం నేల మీదకు మాత్రమే విసిరానని టీనా చౌదరి వెల్లడించారు. నిజానికి ఆ ర్యాలీలో నేను చెబుతున్న మాటలను కనీసం వినడానికి ప్రయత్నించిన ఏకైక వ్యక్తి మంత్రి మహాజన్ మాత్రమే. ఆయన ఆదేశాల మేరకు ఆ రెండు బస్సులను అక్కడి నుండి తొలగించారని.. దాంతో మేమందరం ‘U-turn’ తీసుకుని ప్రధాన రహదారిని చేరుకోగలిగామని ఆమె తెలిపారు.

ఎవరిపైనైనా విమర్శలకు నా భుజాన్ని వేదికగా చేసుకోవద్దు

ఇప్పుడు నేను ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నానని.. దయచేసి ఎవరిపైనైనా విమర్శనాస్త్రాలు సంధించడానికి నా భుజాన్ని వేదికగా వాడుకోవద్దు అని టీనా చౌదరి వ్యాఖ్యానించారు. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ సరిగ్గా ఒకే రకమైన నేరానికి పాల్పడుతున్నాయని..అది సామాన్య ప్రజల పట్ల పూర్తి నిర్లక్ష్యం..ఉదాసీనత అని ఆమె ఆరోపించారు. దీనికి రాజకీయ పార్టీలు సమానంగా బాధ్యత వహించాలని కూడా టీనా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ గొంతుకగా నేను ఉండాలని కోరుతూ వచ్చిన అనేక సందేశాలను నేను చదివాను. ఎందుకు? నేను మీ గొంతుకగా ఉండాల్సిన అవసరం ఏముంది? మీకూ ఒక గొంతుక ఉంది కదా? అని ఆమె ప్రశ్నించారు. నాకు మద్దతు ఇచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, సంక్షోభ సమయంలో ప్రజలు తమ గళాన్ని వినిపించాలని సూచించారు.