Exit Polls | నాడు వాజ్‌పేయి విజయంపైనా ఇంతే ధీమా!

ఎగ్జిట్‌ పోల్ సర్వేలలో వచ్చిన ఫలితాలను చూసుకుని ఎన్డీయే కూటమి మురిసిపోవాల్సిన పని లేదని, ఇండియా కుటమి నిరాశ చెందాల్సిన పనిలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Exit Polls | నాడు వాజ్‌పేయి విజయంపైనా ఇంతే ధీమా!

నాడు వాజ్‌పేయి విజయంపైనా ఇంతే ధీమా!
కానీ.. ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ బొక్కబోర్లా
అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్ సర్వేలలో వచ్చిన ఫలితాలను చూసుకుని ఎన్డీయే కూటమి మురిసిపోవాల్సిన పని లేదని, ఇండియా కుటమి నిరాశ చెందాల్సిన పనిలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు 2004 నాటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అప్పట్లో కూడా సర్వే సంస్థలు బీజేపీకి అనుకూలంగా పూనకం వచ్చినట్టు ఊగిపోయాయి. ఎన్డీయేకు వచ్చే స్థానాలపై భారీ అంచనాలు వేశాయి. కానీ.. వాస్తవ ఫలితాలు వచ్చేసరికి అవన్నీ తుస్సుమన్నాయి.
ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు 230 నుంచి 250 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ – ఏసీ – నీల్సన్‌ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌ కూటమికి 190 నుంచి 205 మధ్య వస్తాయని పేర్కొన్నది. ఇతరులు 100 నుంచి 120 సీట్లు గెలుస్తారని ఊహించింది. ఆజ్‌తక్‌- మార్గ్‌ సైతం ఇదే తరహాలో ఎన్డీయేకు 248 సీట్లు, కాంగ్రెస్‌ కూటమికి 190, ఇతరులకు 105 సీట్లు వస్తాయని తెలిపింది. స్టార్‌ న్యూస్‌- సీవోటర్‌ సంస్థ ఎన్డీయేకు 263 నుంచి 275 మధ్య సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని ప్రకటించింది. కాంగ్రెస్‌ కూటమికి 174 నుంచి 186 మధ్య రావచ్చని, ఇతరులు 86 నుంచి 98 మధ్య సీట్లు గెలుస్తారని పేర్కొన్నది. జీ-తలీమ్‌ సైతం ఎన్డీయేకు 249, కాంగ్రెస్‌ కూటమికి 176, ఇతరులకు 117 వస్తాయని అంచనా వేసింది. ఇక సహారా – డీఆరెస్‌ సంస్థ ఎన్డీయేకు 263 నుంచి 278 కట్టబెట్టింది. కాంగ్రెస్‌ కూటమికి 171 నుంచి 181, ఇతరులకు 92 నుంచి 102 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. అవుట్‌లుక్‌ -ఎండీఆర్‌ఏ సైతం ఎన్డీయేకు 280, కాంగ్రెస్‌ కూటమికి 159 నుంచి 169, ఇతరులకు 89 నుంచి 99 సీట్లు రావచ్చని అంచనాలు గుప్పించాయి. తీరా వాస్తవంగా ఓట్ల లెక్కింపు ముగిసి ఫలితాలు వెల్లడించే సరికి ఎన్డీయే 189 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్‌ 222 సీట్లు గెలుచుకున్నది. ఇతరులు 132 సీట్లలో గెలుపొందారు.