ఉద్ధవ్ సేనలోకి ఎన్సీపీ (అజిత్) నేత … ఛగన్ భుజ్‌బల్?
ఎన్సీపీ (అజిత్‌పవార్) నేత, మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్‌భుజ్‌బల్ (76) ఆ పార్టీకి రాంరాం చెప్పబోతున్నారని తెలుస్తున్నది. ఉద్ధవ్‌ఠాక్రే నాయకత్వంలోని శివసేనలో ఆయన చేరబోతున్నారని సమాచారం

ముంబై: ఎన్సీపీ (అజిత్‌పవార్) నేత, మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్‌భుజ్‌బల్ (76) ఆ పార్టీకి రాంరాం చెప్పబోతున్నారని తెలుస్తున్నది. ఉద్ధవ్‌ఠాక్రే నాయకత్వంలోని శివసేనలో ఆయన చేరబోతున్నారని సమాచారం. పార్టీలో తనను పక్కన పెట్టేస్తున్నారన్న అసంతృప్తిలో ఉన్న భుజ్‌బల్.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో విభేదాలు ఉన్నప్పటికీ.. ఉద్ధవ్‌సేనలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ప్రముఖ ఓబీసీ నేత అయిన భుజ్‌బల్.. సమతాపరిషద్ అనే సామాజిక సంస్థను కూడా నడుపుతున్నారు. తన మద్దతుదారులతో సోమవారం (17.06.2024) సమావేశం నిర్వహించిన భుజ్‌బల్.. తనకు ఉన్న మార్గాలపై పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సొంతగా కొత్త పార్టీ స్థాపించడమా? లేక శివసేన (ఉద్ధవ్) లో చేరడమా అనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ సీటును ఆయన ఆశించినా.. పార్టీ నుంచి సానుకూలత రాలేదు. కనీసం రాజ్యసభ సీటైనా దక్కుతుందని భావించినా.. అజిత్‌పవార్ భార్య నునేత్ర పవార్‌ను పార్టీ నామినేట్ చేసింది. సునేత్ర.. ఇటీవలి ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చేందుకు 18 నుంచి 19 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం తమ పార్టీలో చేరుతారని ఎన్సీపీ (శరద్‌పవార్) అధినేత శరద్‌పవార్ మునిమనుమడు రోహిత్‌పవార్ చెప్పిన నేపథ్యంలో భుజ్‌బల్ ఈ నిర్ణయానికి రావడం గమనార్హం.
ఛగన్‌భుజ్‌బల్ గతంలో శివసేనలో ఉండేవారు. ఉమ్మడి శివసేన చీలికకు మూడు దశాబ్దాల క్రితమే ఆ పార్టీని వదిలి.. శరద్‌పవార్ పక్షాన చేరారు.
సోమవారం భుజ్‌బల్ తన సమతాపరిషద్ ఆఫీస్‌బేరర్ల సమావేశం నిర్వహించారు. దాదాపు 50 మంది ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో పార్టీ మార్పు లేదా కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ.. ఎన్సీపీ (అజిత్)ని వీడటం మాత్రం ఖాయమని భజ్‌బల్ సన్నిహితుడు ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని భుజ్‌బల్ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఓబీసీ కోటాపై ఆయన వైఖరి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పార్టీలో భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారని మరో నేత తెలిపారు.