రాజస్థానీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేసిన ఎన్డీటీవీ పోల్ సర్వే

- గెహ్లాట్ పాలనపై ప్రజలు సంతృప్తి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రధాని మోడీ వర్సెస్ సీఎం అశోక్ గెహ్లాట్ అనే విధంగా సాగుతున్నది. ఈ ఎన్నికల పోరులో ఎవరు నెగ్గుతారనే ఆసక్తి నెలకొన్నది. గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అనే విషయంపై ఎన్‌డీటీవీ-సీఎస్‌డీఎస్ లోక్‌నీతి ప్రీపోల్ సర్వే ఈ ప్రశ్నల్నింటికీ సమాధానాలు ఓటర్ల నుంచి రాబట్టే ప్రయత్నం చేసింది.

అక్టోబర్ 24- 30 తేదీల మధ్య జరిగిన ఈ సర్వే 30 నియోజకవర్గాల్లో 3032 శాంపిల్స్ సేకరించినట్లు చెప్పింది. ఈసర్వేలో ఓటర్ల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయం తెలుసుకున్నది. విద్య, వైద్యం, మంచినీరు, కరెంట్, శాంతిభధ్రతలు, మహిళ భద్రత వంటి మొదలైన అంశాల్లో గెహ్లాట్ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లు సంతృప్తికరంగా ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదంటే 55 శాతం మంది ఓటర్లు బాగుందని చెప్పారు. మహిళ కోసం ఏ ప్రభుత్వం బాగా పనిచేసిందనే ప్రశ్నకు 24 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం, 32 శాతం మంది కేంద్ర ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 26 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చేశాయనగా, 5 శాతం మంది రెండూ కాదని సమాధానమిచ్చారు.

గెహ్లాట్ ప్రభుత్వపాలనలో ప్రభుత్వ పాఠశాలలు 60 శాతం బాగుపడ్డాయనగా, 21 శాతం అధ్వాన్నంగా ఉన్నాయనే సర్వేలో తేలింది. ప్రభుత్వ ఆస్పత్రులు 58 శాతం బాగుపడ్డాయంటే 24 శాతం బాగాలేవని అభిప్రాయం వ్యక్తమైంది. గెహ్లాట్ ప్రభుత్వ పాలన పట్ల 43 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేయగా, 23 శాతం మంది కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేశారు. 10 శాతం కొంతవరకు, 14 శాతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చాలా బాగా పోరాడుతున్నదని 39 శాతం మంది చెప్పారు. 30శాతం మంది బాగుందని, 15 శాతం మంది పోరాడటం లేదన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో గెహ్లాట్ ప్రభుత్వ పనితీరు 5 శాతం అసలే బాగాలేదన్నారు. 6 శాతం మంది చెప్పలేమన్నారు.

ఈ ఎన్నికల్లో సామాజిక జనాభా పరంగా ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా మహిళల్లో 45 శాతం మంది బీజేపీ వైపు, 39 శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. పురుషుల్లో 43 శాతం మంది బీజేపీకి, 41 శాతం మంది కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నట్టు తేలింది. ఈ ఎన్నికల్లో కీలకమైన జాట్స్ 34శాతం బీజేపీ, 42శాతం కాంగ్రెస్, ఓబీసీలు 45 శాతం మంది బీజేపీ, 35 శాతం కాంగ్రెస్ వైపు 96 శాతం ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారు.

గెహ్లాట్ వర్సెస్ మోడీ అంటే 32 శాతం గెహ్లాట్ వైపు 37 శాతం మంది మోడీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రిగా 27 శాతం మంది గెహ్లాట్‌కు వసుంధరా రాజేకు 14 శాతం, సచినల్ పైలట్ కు 9 శాతం, గజేంద్రసింగ్ షెకావత్ 6 శాతంమంది అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఫరవాలేదని 8 శాతం, బీజేపీ నుంచి ఎవరైనా ఓకే అని 15 శాతం ఓటర్లు చెప్పారు. ఇవన్నీమొత్తంగా చూస్తే ఎక్కువశాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వంపైనే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది.