నీట్ పేపర్ లీక్ నిరసనలపై ప్రధాని కీలక ప్రకటన

నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ, ప్రతిపక్షాలు, విద్యార్ధులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. అటు సీజేపీ మాత్రం ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించింది.

నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ, ప్రతిపక్షాలు, విద్యార్ధులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల సంక్షేమం కంటే ఏదీ ముఖ్యం కాదు అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని వదిలి పెట్టబోం అని మోదీ స్పష్టం చేశారు.పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలకు, లీకేజీ దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఇందుకోసం సంబంధిత శాఖలు, అధికారులకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు. విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. వారికి చట్టపరంగా కఠినమైన శిక్ష అమలయ్యేలా చూస్తామని ప్రధాని మోడీ భరోసానిచ్చారు. విద్యార్ధుల ప్రయోజనాల పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

పేపర్ లీకేజీ దోషులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికి సీజేపీ మాత్రం తన ఆందోళనల నుంచి వెనక్కి తగ్గలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఆందోళన కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది. వాంగ్ చుక్ ను ఆసుపత్రి నిర్భంధం నుంచి విడుదల చేయాలని, నిర్బంధంలో ఉన్న విద్యార్ధులపై ఎలాంటి కేసులు పెట్టరాదని, పెట్టిన కేసులు ఎత్తివేయాలని, నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులకు పరిహారం చెల్లించాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. తమ డిమాండ్లను ఆమోదించేవరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.

అటు ఆసుపత్రిలో ఉన్న వాంగ్ చుక్ తన నిరాహర దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యార్ధులపై కేసులు ఎత్తివేస్తే తన నిరాహార దీక్ష్ విరమిస్తానని ఆయన షరతు పెట్టారు. మరోవైపు పార్లమెంటులో పేపర్ల లీకేజీలపై చర్యకు కేంద్రం సిద్దంగా ఉందని ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి : రాహుల్ గాంధీ

పేపర్ల లీకేజీలపై విద్యార్ధుల నిరసనలపై ప్రధాని మోదీ ప్రకటనకు ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. యువత భవిష్యత్తుకు హాని చేస్తుంది మీరేనని ‘ఎక్స్’లో రాహుల్‌ పోస్టు పెట్టారు. విద్యావ్యవస్థను నాశనం చేయడానికి ప్రోత్సహించడమే కాక, దానికి బాధ్యులైన వారిని రక్షించారని విమర్శించారు. ఈసందర్భంగా రాహుల్‌ ప్రధానికి మూడు డిమాండ్లను తెలిపారు. అందులో ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

 

Latest News